రైతుబజార్ల వద్ద ఘర్షణ పెట్టిస్తున్న 'ఉల్లి'

By Newsmeter.Network  Published on  7 Dec 2019 1:23 PM GMT
రైతుబజార్ల వద్ద ఘర్షణ పెట్టిస్తున్న ఉల్లి

ముఖ్యాంశాలు

  • రైతుబజార్‌ కౌంటర్ల వద్ద తోపులాట
  • సిబ్బందిపై ఘర్షణకు దిగుతున్న ప్రజలు
  • పోలీసు బందోబస్తు మధ్య ఉల్లి విక్రయాలు
  • కౌంటర్ల వద్ద లొల్లి ముదిరిస్తున్న 'ఉల్లి'

ఉల్లి ధరలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఉల్లి ధర పెరిగిపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఇప్పుడు రూ. 150 చొప్పున అమ్ముతున్నారు. ఉల్లి ధర అకాశన్నంటడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. రాయితీ ఉల్లి కిలో రూ.25కే లభించడంతో ఎక్కువ మంది రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. అయితే అక్కడకు కూడా సరకు చాలా తక్కువగా వస్తుండడంతో క్యూలో నిల్చొన్న వారందరికీ ఇవ్వలేకపోతున్నారు. ఉల్లి అయిపోయిన వెంటనే...ఇక ఉల్లి లేదని ప్రకటిస్తున్నారు. దాంతో లైనులో నిల్చొన్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము లైన్లో రెండు గంటల నుంచి నిల్చొంటే...లేదని వెనక్కి పంపిస్తారా? అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో రైతుబజార్ల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. జనాల ఆగ్రహంతో పోలీసులకు, సిబ్బందికి తలనొప్పిగా మారింది. జనాలను ఎంత సముదాయించినా.. జనాలు ఎంతకీ ఆగడం లేదు. తోపులాట జరగడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి కౌంటర్‌లో విక్రయాలు జరుపుతున్న వారిని కిందికి లాగి ఘర్షణకు దిగారు. వారిని అడ్డుకోవడానికి మహిళా కానిస్టేబుల్‌ యత్నించగా ఆమెను సైతం తోసేస్తున్నారు. ఉల్లి కోసం ఎక్కువగా మహిళలే బజార్లకు వస్తున్నారు.

రైతు బజార్ల దగ్గర ఉదయం ఐదు గంటలకే బారులు తీరుతున్నారు. కాగా, కౌంటర్లు తెరిచిన గంట, రెండు గంటల సమయంలోనే ఉల్లి అయిపోవడంతో ప్రజలు సిబ్బందిపై ఘర్షణకు దిగుతున్నారు. ఉల్లిపాయలను విక్రయిస్తే అందరికి వచ్చేలా చూడాలని, లేదంటే కౌంటర్లను మూసేసుకోండని జనాలు మండిపడుతున్నారు. రైతుబజార్ల వద్దే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి అయిపోతే మళ్లీ ఏ సమయంలో ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

2013లో కూడా ఇలా....

2013లోను ఇలాగే ఉల్లికి డిమాండ్‌ ఏర్పడింది. కిలో ధర రూ.100కి చేరింది. అప్పుడు రాయితీ ఉల్లిని విక్రయించడానికి రెవెన్యూ, సివిల్‌ సప్లయిస్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారులంతా సమన్వయంతో రైతుబజార్లను ఏర్పాటు చేసి విక్రయించారు. రైతుబజార్లలో బారికేడ్లు కట్టి, రేషన్‌ కార్డు తెచ్చిన వారికే ఉల్లి ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి వారానికి రెండు కిలోలు చొప్పున పంపిణీ చేశారు. ఉల్లి తీసుకున్న వారికి కార్డును పంచింగ్‌ చేశారు. దీనివల్ల ఒకసారి సరకు తీసుకున్నవారు మళ్లీ మళ్లీ రావడానికి వీల్లేకుండా పోయింది. సవ్యంగా పంపిణీ జరిగింది. ఇప్పుడు ఏ విధానమూ లేకపోవడంతో అందిన వారికే అందుతున్నాయి...మిగత వారికి అందకపోవడంతో జనాల్లో నిరసన వ్యక్తమవుతోంది.

Next Story
Share it