భారత్‌లో కోటి దాటిన కరోనా పరీక్షలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 July 2020 11:58 AM GMTభారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అదే రీతిన టెస్టులను కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. ఆ వివరాలను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎఎంఆర్) సోమవారం నాడు వెల్లడించింది.
ఐసీఎంఆర్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ లోకేష్ శర్మ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 11 గంటల వరకు భారత్‌లో మొత్తం 1,00,04,101 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆదివారం ఒక్కరోజు 1,80,596 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 24,248 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. రోజుకు 2 లక్షల 15 వేల 655 శాంపిల్స్ చొప్పున పరీక్షించినట్లు, గడిచిన ఐదు రోజుల్లో పది లక్షల టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే.. ఐసీఎంఆర్.. దేశంలో 1100 ల్యాబ్‌లకు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం అనుమతినిచ్చింది. వీటిలో 788 ప్రభుత్వ ల్యాబులు ఉండగా, 317 ప్రైవేటు ల్యాబులు ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 61, తెలంగాణలో 36 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఇక కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా, బ్రెజిల్ దేశాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.