Fact Check : నేపాల్ సైనికులు ఏడుగురు భారత సైనికులను కాల్చి చంపారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2020 3:42 AM GMTభారత భూభాగాలను తమ భూభాగాలుగా చెబుతూ నేపాల్ ఇటీవలే కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. దీంతో భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధాలు అంతగా బాగోలేవంటూ కథనాలు వచ్చాయి. నేపాల్ చేస్తున్న పనుల వెనుక చైనా ఉందనే అనుమానాలు కూడా వెల్లడయ్యాయి. భారత్-నేపాల్ ల మధ్య ఎటువంటి సరిహద్దు సమస్యలు లేవు. ఇలాంటి సమయంలో ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
Indian coward Army initiated unprovoked ceasefire violation across the India-Nepal border at Belahiya.
At least 3 civilians were injured as a result of unprovoked Indian firing. In responding, our brave soldiers killed 7 Indian soldiers. pic.twitter.com/R7l69gafYu
— irmak idoya🇳🇵 (@irmaknepal2) July 5, 2020
Irmak Idoya అనే ట్విట్టర్ యూజర్ “Indian coward Army initiated unprovoked ceasefire violation across the India-Nepal border at Belahiya. At least 3 civilians were injured as a result of unprovoked Indian firing. In response, our brave soldiers killed 7 Indian soldiers (Sic).” పోస్టు పెట్టాడు. ఏడుగురు చనిపోయిన సైనికుల మృతదేహాలను కూడా పోస్టు చేశాడు.
భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం కాల్పుల ఉల్లంఘనకు తూట్లు పొడిచిందని.. భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బెలాహియా వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రజలకు గాయాలయ్యాయని.. నేపాల్ సైన్యం ప్రతిఘటించి కాల్పులు జరపగా 7 మంది భారత సైనికులు చనిపోయారంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.
ఆర్కైవ్ చేసిన ట్వీట్ ను http://archive.vn/zW2OC లో చూడొచ్చు.
ఈ ట్వీట్ కు 4500 కు పైగా లైక్ లు, 1500కు పైగా రీట్వీట్ లు లభించాయి.
ఫేస్ బుక్ లో కూడా ఈ పోస్టును షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పటివి కావు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం అన్నదాన్లో కూడా నిజం లేదు.
నేపాల్ ఆర్మ్డ్ ఫోర్స్ కు చెందిన ఫోటో ఎప్పటి నుండో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నేపాల్ కు చెందిన రాష్ట్రీయ సమాచార్ సమితికి చెందిన ఫైల్ ఫోటోను ఎప్పటి నుండో చాలా మీడియా సంస్థలు వాడుకుంటూ ఉన్నాయి.
నేపాల్ సైనికులు చనిపోయారంటూ వైరల్ అవుతున్న భారత సైనికుల మృతదేహాలకు సంబంధించిన ఫోటో 2015 నాటిది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇండియా టుడే లో మే 3, 2015న ఫోటోతో పాటూ ఓ ఆర్టికల్ ను కూడా ప్రచురించారు. అస్సామ్ రైఫిల్ జవాన్లు నాగా మిలిటెంట్లు చేసిన దాడిలో అమరులయ్యారు. అప్పటి ఫోటో ఇది..!
గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవలో చనిపోయిన సైనికులు అంటూ ఈ ఫోటోను వైరల్ చేశారు. The Quint కూడా ఈ ఫోటో మీద నిజ నిర్ధారణ చేసి తప్పు అని నిరూపించింది.
భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఎటువంటి కాల్పుల ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకోలేదు. నేపాల్ సైనికులు 7 మంది భారత సైనికులను కాల్చి చంపారన్నది 'పచ్చి అబద్ధం'