Fact Check : రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సరిహద్దులోని కంచెకు మిరప, నిమ్మకాయల దండ వేయలేదు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 July 2020 12:55 PM GMTహైదరాబాద్: చైనా భారత్ మధ్య తాజాగా జరిగిన గాల్వన్ లోయ ఉద్రిక్తతల అనంతరం, దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మన సరిహద్దు కంచెకు మిరప, నిమ్మకాయల దండ వేస్తున్నట్లుగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఆ ఫోటోలోనే ఒక నల్లటి పట్టీపై, రవాణా వాహనాలపై రాసి ఉన్నట్లుగా, ‘చెడ్డ చూపుల వాడా.. నీ మొహం మాడ..’ అని అర్ధం వచ్చేలా రాసి ఉంది.
ఆ ఫోటోను షేర్ చేస్తున్న వ్యక్తులు ఇలాంటి కామెంట్లు రాశారు.
‘మన రక్షణ మంత్రి ఒక అత్యాధునిక యంత్రాన్ని ప్రతిష్టించటం చూసే వరకూ సరిహద్దు దగ్గర పరిస్థితిపై నాకు ఆందోళన ఉండేది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది.’‘నిమ్మకాయలు, మిరపకాయల రెండింతల శక్తి. ఇక చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్
దేశాలు భారత దేశం వెంట్రుకకు కూడా హాని చేయలేవు.’
ఈ ఫోటోలు నిజం కాదని కొంత మందికి తెలిసినప్పటికీ, చాలా మంది దీన్ని చూసి నవ్వుకుని, మళ్లీ షేర్ చేశారు. సరే, మరి నిజమేంటి?
నిజ నిర్ధారణ:
ప్రచారంలో ఉన్న చిత్రం గురించి మేము గూగుల్ లోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెదికేందుకు ప్రయత్నించాము. అయితే అదే ఫోటోతో ఉన్న మరికొన్ని పోస్టులు ఆ ఫలితాలలో లభించాయి. దీంతో Rajnath Singh Nimbu Mirchi అనే కీ వర్డ్స్ఉపయోగించి మామూలుగా సెర్చ్ చేశాము. అప్పుడు అక్టోబరు 8, 2019న ఫ్రాన్స్ లో రాఫాల్ ఫైటర్ జెట్ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డెలివరీ తీసుకున్నసమయంలో శస్త్రపూజ చేయటంపై విమర్శలతో పాటు, సెటైర్లతో కూడిన ఫోటోలు, వార్తలు ఆ సెర్చ్ ఫలితాలలో కనిపించాయి.
ఆ సంఘటన గురించి మరికొంత శోధించగా.. thepublicsradio.org వెబ్ సైటు నందు అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) ఏజెన్సీ పోస్టు చేసిన వార్త లభించింది. రాఫాల్ ఫైటర్ విమానంను అందుకున్న అనంతరం రాజ్ నాథ్ సింగ్ ఆ విమానం పై ఓమ్ గుర్తుని రాశారని, జెట్ టైర్ల కింద నిమ్మకాయలు ఉంచారని, ఇదంతా సంప్రదాయంలో భాగంగా చేశారని వివరించింది.
ఆ లింక్:
https://thepublicsradio.org/article/france-delivers-first-rafale-fighter-jet-to-india
ఈ పేజీలోని అసలైన ఫోటోనే ఎవరో తుంటరి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి రక్షణ మంత్రి సరిహద్దు కంచెకు నిమ్మకాయలు, మిరపకాయల దండ కడుతున్నట్లుగా ప్రచారంలో పెట్టారు. అది పూర్తిగా అబద్ధం.
- ఎన్ ఎన్ ధర్మసేన