మంత్రిగారి బూట్లు.. ఎక్కడ నీళ్లలో తడుస్తాయోనని..
Tamilnadu minister won't wet his shoes, fishermen carry him from boat to land. కొందరు రాజకీయ నాయకులకు పదవులు రాగానే.. తామేదో
By Medi Samrat
కొందరు రాజకీయ నాయకులకు పదవులు రాగానే.. తామేదో పైనుండి కిందకు దిగి వచ్చిన వాళ్లమని భావిస్తూ ఉంటారు. మనుషుల కంటే తమ దగ్గర ఉన్న వస్తువులే గొప్ప అని భావిస్తూ ఉంటారు. అలా భావించిన ఓ మంత్రి.. కాళ్లు కింద పెడితే ఎక్కడ తన బూట్లు తడుస్తాయోనని భావించి.. ఏకంగా అక్కడి వాళ్ళతో మోయమని చెప్పారు. ఇక మంత్రి గారు.. ఆయన అనుచరులు కూడా మోయండయ్యా అనడం.. వాళ్లు మోయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం నేషనల్ లెవల్ అయ్యి.. సదరు మంత్రి గారిని నెటిజన్లు ఏకి పారేస్తూ ఉన్నారు. మంత్రి వీఐపీ కల్చర్‌పై పలువురు విమర్శలు చేశారు.
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాలవర్కడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ సముద్రపు కోతను పరిశీలించేందుకు పర్యటించారు. స్థానికులతో మాట్లాడిన అనంతరం పడవపై ఆయన ప్రయాణించారు. బోటు తీరానికి చేరగా మంత్రి దిగేందుకు మత్స్యకారులు ఒక కూర్చివేశారు. అయితే పడవ ఒడ్డుకు కాస్త దూరంలో నిలిచింది. దీంతో తన కాలి బూట్లు నీటిలో తడుస్తాయని భావించిన అనితా రాధాకృష్ణన్ పడవ దిగేందుకు ససేమిరా అన్నారు. దీంతో మత్స్యకారులు ఆయనను తమ చేతులపై మోసి ఒడ్డుకు చేర్చారు.
తాను చేసింది తప్పే కాదని సదరు మంత్రి అంటున్నారు. "అందులో తప్పేంటి? వారు ఆప్యాయంగా అడిగితే, మనం ఎక్కాలి. నేను వారి భుజాలపై ఎక్కాలని డిమాండ్ చేస్తే అది తప్పు" అని ఆయన అన్నారు. "ఒక మత్స్య మంత్రి ఒక మత్స్యకారుడి భుజంపై మాత్రమే ఎక్కగలడు" అని సమర్థించుకున్నారు.