తమిళనాడులోని సేలంకు చెందిన ఒక యూట్యూబర్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్.. గత మూడేళ్లుగా తాను పొదుపు చేసిన ఒక రూపాయి నాణేలను చెల్లించి బైక్‌ను కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుడు, అతని స్నేహితులు, ఐదుగురు సిబ్బంది డబ్బులను లెక్కించేందుకు పది గంటల సమయం పట్టిందని షోరూం సిబ్బంది తెలిపారు. 29 ఏళ్ల భూపతికి బజాజ్ డామినార్ 400 అంటే చాలా ఇష్టం. మూడేళ్ల క్రితం షోరూమ్‌లో ఆరా తీస్తే దాని ధర రూ. 2 లక్షలుగా ఉంది. అప్పుడు అతని వద్ద డబ్బులు లేకపోవడంతో.. డబ్బు పోగేయడం మొదలుపెట్టాడు.
ఇటీవల షోరూమ్‌ను సంప్రదించగా రూ.2.61 లక్షలకు పెరిగినట్లు తెలిసింది. అయితే.. భూపతి ఆ డబ్బును ఆదా చేసాడు. అది కూడా ఒక రూపాయి నాణేల రూపంలో దాచాడు. నాణేల కోసం కరెన్సీ నోట్లను మార్పిడి చేశాడు. దాచిన డబ్బును వ్యాన్‌లో తీసుకొచ్చి చక్రాల బండిల్లో షోరూమ్‌కు తరలించారు. షోరూమ్ మేనేజర్ మహావిక్రాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఒక రూపాయి నాణేలను తీసుకోవడానికి ఇష్టపడలేదని.. అయితే ఈ బైక్ కొనడం కోసమే భూపతి వాటిని సేకరించినట్లు గుర్తించినప్పుడు అంగీకరించామని తెలిపాడు.