భారత్ లో వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. కొన్ని ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రజలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ గురించి ఎన్నో అపోహలు ఉండడం.. వదంతులు ప్రచారంలో ఉంటుండడంతో వ్యాక్సిన్లను వేయించుకోడానికి భయపడుతూ ఉన్న వాళ్లు ఎందరో ఉన్నారు. ఇక వ్యాక్సిన్ వేయించుకుంటే తప్పితే కరోనా నుండి దేశం విముక్తి అవ్వలేదు. కాబట్టి వ్యాక్సిన్లు వేయించుకునేలా ప్రోత్సహించడానికి చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గిఫ్టులను ఇస్తుండడమే కాకుండా.. లక్కీ డ్రాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రోత్సాహకాలు మొదలయ్యాయి.

తమిళనాడు రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రజలు మొగ్గు చూపేలా.. లక్కీ డ్రాలను నిర్వహిస్తూ వస్తున్నారు. చెన్నై కోవలం ప్రాంతానికి చెందిన యువకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి బిర్యానీ, డ్రా పద్ధతిలో మోటార్‌ సైకిల్‌, వాషింగ్‌మెషీన్‌, గోల్డ్‌ కాయిన్‌లను బహుమతిగా అందజేయనున్నట్టు ప్రకటించారు. కోవలం ప్రాంతంలో ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు ఉత్సాహం చూపకపోవడంతో ఆ యువకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వైరస్‌ ఉధృతి తీవ్రతరం అవుతుండడంతో, దీని ప్రభావాన్ని తగ్గించేందుకు ఆరోగ్యశాఖ స్వచ్ఛంధ సేవాసంస్థలకు పిలుపు నిచ్చింది. అందుకే ఆ ప్రాంతానికి చెందిన యువకులు వ్యాక్సిన్‌ వేయించుకొనే వారిలో నుండి లక్కీ డ్రా తీసి.. బహుమతులను అందజేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్-19 ఫ్రీ జోన్ గా చేయాలని ఆ యువకులు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమో అవుతుందన్న భయాలు ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి.


సామ్రాట్

Next Story