కేరళలో ఓ వలస కూలీకి రూ.75 లక్షల లాటరీ తగిలింది. దీంతో కంగారుపడ్డ కూలీ రక్షణ కోరుతూ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్‌కె బడేశ్.. కేరళ ప్రభుత్వ స్త్రీ శక్తి లాటరీలో రూ. 75 లక్షలను గెలుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బడేశ్ మంగళవారం అర్థరాత్రి మువట్టుపుజ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. తన ప్రైజ్ మనీకి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాడు.
తన నుంచి ఎవరైనా టిక్కెట్టు లాక్కుంటారని.. తనకు తదుపరి లాంఛనాలు తెలియవని.. భయంతో ఎస్కే బడేశ్ పోలీసులను ఆశ్రయించాడు. మువట్టుపుజ పోలీసులు ఆయనకు విధివిధానాలు అర్థమయ్యేలా చేసి అన్ని రకాల భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్కే బడేశ్ గతంలో కూడా లాటరీ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.. కానీ ఎప్పుడూ గెలవలేదు. ఎప్పటికైనా గెలవాలని ఆశించేవాడు.
ఎర్నాకులంలోని చొట్టానికరలో ఎస్‌కే బడేశ్ రోడ్డు నిర్మాణ పనుల్లో కూలీగా చేస్తూ టికెట్ ను కొనుగోలు చేశాడు. SK బడేష్ కేరళకు వలస వచ్చి ఎంతో కాలం కాలేదు.. దీంతో అతనికి మలయాళ భాష తెలియదు. అతను సాయం కోసం తన స్నేహితుడు కుమార్‌ను పిలిచాడు. డబ్బు రాగానే బెంగాల్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లాలని బడేశ్ నిర్ణయించుకున్నాడు. కేరళ తనకు తెచ్చిన అదృష్టంతో తన ఇంటిని పునరుద్ధరించుకోవాలని.. వ్యవసాయాన్ని విస్తరించాలని అతను ఆశిస్తున్నాడు.