వృద్ధుడి జీవితాన్ని మార్చేసిన లాటరీ.. రాత్రికి రాత్రే రూ.5 కోట్ల జాక్‌పాట్‌

88 Year Old Man Wins Rs 5 Crore Lottery In Punjab Derabassi. ఓ లాటరీ టికెట్‌ 88 ఏళ్ల వృద్ధుడి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. లాటరీ జాక్‌పాట్‌ కొట్టడంతో

By అంజి  Published on  20 Jan 2023 5:14 PM IST
వృద్ధుడి జీవితాన్ని మార్చేసిన లాటరీ.. రాత్రికి రాత్రే రూ.5 కోట్ల జాక్‌పాట్‌

ఓ లాటరీ టికెట్‌ 88 ఏళ్ల వృద్ధుడి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. లాటరీ జాక్‌పాట్‌ కొట్టడంతో ఆ వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. 35 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ వస్తున్న ఆ వృద్ధుడు.. ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్ల జాక్‌పాట్‌ గెల్చుకున్నాడు. పంజాబ్‌లోని దేరాబస్సీకి చెందిన మహంత్‌ ద్వారాక దాస్‌ గత 35 ఏళ్లుగా లాటరీలు కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. అతడికి లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఇన్నేళ్ల తర్వాత అతడు విజేత బహుమతిని గెల్చుకున్నాడు. లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ లాటరీ 2023లో మహంత్ మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.

లాటరీలో 5 కోట్ల రూపాయలు గెలుచుకున్న తర్వాత మహంత్‌ మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొంటున్నాను. తాజాగా గెలిచిన ప్రైజ్ మనీని తన ఇద్దరు కుమారులు, తన 'డేరా'కి పంచుతానని చెప్పాడు. మహంత్ కుమారుడు నరేందర్ కుమార్ శర్మతో మాట్లాడుతూ.. లాటరీ టికెట్ కొనడానికి తన తండ్రి తన మనవడికి డబ్బు ఇచ్చాడని, అతను గెలిచాడని చెప్పాడు. మహంత్‌ ద్వారకా దాస్‌ 13 ఏళ్ల వస్సులో 1947లో తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చాడు. అప్పటి నుంచి పంజాబ్‌లోనే స్థిరపడ్డాడు.

అయితే లాటరీ బహుమతి పన్ను మినహాయింపుకు లోబడి ఉన్నందున, మహంత్ లాటరీ పూర్తి మొత్తాన్ని రూ. 5 కోట్లను పొందలేడు. అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ ప్రకారం.. మహంత్ 5 కోట్ల రూపాయల నుండి 30% పన్ను మినహాయింపు తర్వాత లాటరీ మొత్తాన్ని అందుకుంటారు. "పంజాబ్ స్టేట్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్ లాటరీ 2023 ఫలితాలు జనవరి 16న ప్రకటించబడ్డాయి. ద్వారకా దాస్ రూ. 5 కోట్ల మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. నిర్దేశించిన విధానాన్ని పూర్తి చేసిన తర్వాత, 30% పన్ను మినహాయించిన తర్వాత మొత్తం అతనికి డబ్బు ఇవ్వబడుతుంది" అని లాటరీ అసిస్టెంట్ డైరెక్టర్ కరమ్ సింగ్ తెలిపారు.


Next Story