ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ...!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Oct 2019 2:34 PM ISTహైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. సమ్మెను ఆపేదిలేదని, మాకు న్యాయం చెయ్యాలని లేకపోతే ఇంకా ఉదృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో మనస్థాపానికి గురైన ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి తన శనివారం ఇంటివద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ రెడ్డి శరీరంలో తొంబై శాతం మేర కాలిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒక పక్క మనస్థాపానికి గురై ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కాస్త కూడా తగ్గకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన ధ్రువపత్రాలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీపంలోని డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది అని పత్రికలో ప్రకటన ఇచ్చారు.
కాగా పోస్టుల ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ విధానంలో పారితోషికం చెల్లిస్తారు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.. డ్రైవర్, కండక్టర్, మెకానికల్ సూపర్ వైజర్స్, మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బంది, ఐటీ ట్రైనర్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించాలి అని పత్రికలో ప్రకటన ఇచ్చారు. మరి ఈ నియామకాలపై ఆర్టీసీ కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి.