మారిటోరియంకు చెల్లుచీటి.. వచ్చే నెల నుంచి ఈఎంఐలు కట్టాల్సిందే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 11:30 AM ISTకరోనా నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయాన్ని ఆర్ బీఐ ప్రకటించటం తెలిసిందే. కరోనా కేసులు నమోదవుతున్న వేళ.. కేసుల్ని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం తెలిసిందే. దీంతో.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కిరాణా.. పండ్లు.. కూరగాయలు మాదిరి కొన్ని అత్యవసర సేవలు మినహా.. మిగిలిన వ్యాపాలన్నింటిని క్లోజ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవటమే కాదు.. అన్ని వ్యాపారాలు ఒక్కసారిగా మూతపడటంతో.. వ్యాపార వర్గాలతో పాటు.. వేతన జీవులకు షాకుల మీద షాకులు తగిలాయి.
ఈ నేపథ్యంలో బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వాయిదాల పద్దతిలో చెల్లించే వారికి ఊరటనిస్తూ ఆర్ బీఐ మారిటోరియంను ప్రకటించింది. తొలుత మూడు నెలలు కాస్తా.. తర్వాత మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతొ వ్యాపార వర్గాలతో పాటు.. వేతల జీవులకు కొంత ఉపశమనం లభించింది. అయితే.. మారిటోరియం విధానంలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. అదనపు భారం పడుతుందన్న వాదన వినిపించింది. అప్పటికప్పుడు వాయిదాల్ని తిరిగి చెల్లించే దానితో పోలిస్తే.. భారం కాస్త తగ్గేలా ఉండటంతో దీన్ని ఉపయోగించుకున్నోళ్లు చాలామందే ఉన్నారు.
పరిస్థితి ఇప్పటికి మెరుగుపడని విషయం తెలిసిందే. అన్ లాక్ వెర్షన్లను తెర మీదకు వచ్చినా.. ఇప్పటికి అన్ని వ్యాపారాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కొన్ని వ్యాపార సంస్థలు ఓపెన్ అయినా.. గతంతో పోలిస్తే.. యాభై శాతం మేర కూడా వ్యాపారం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ.. జీతాల్లో కోతతో పాటు..సిబ్బంది తొలగింపుతో పాటు.. వ్యాపార వర్గాల వారు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు.
ఇలా అందరిపైనా కరోనా ప్రభావం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ.. వచ్చే నెల నుంచి (సెప్టెంబరు ఒకటి) మారిటోరియం ఉండదన్న విషయాన్ని ఆర్ బీఐ చెప్పకనే చెప్పేసింది. మారిటోరియంను పొడిగించే విషయాన్ని స్పష్టంగా వెల్లడించనప్పటికీ.. దాని కారణంగా చోటు చేసుకునే విపరిణామాల్ని ప్రస్తావించింది. దీన్నిచూస్తే.. సెప్టెంబరు ఒకటి నుంచి మారిటోరియం అన్నది లేదన్నది స్పష్టమవుతుంది. మారిటోరియంపై ఆర్ బీఐ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు ఊతమిస్తున్నాయి.
‘‘దీర్ఘకాలం పాటు రుణాల మారటోరియం కొనసాగించడం, రుణపునర్ వ్యవస్థీకరణ వంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక స్వస్థతను దెబ్బ తీస్తాయి. ఏ మాత్రం అలసత్వం లేకుండా సునిశిత పర్యవేక్షణలో న్యాయబద్ధమైన రీతిలో మాత్రమే అవి అమలుజరిగేలా చూడడం తప్పనిసరి. ఈ ఏడాది మార్చిలో మొండి బకాయిలు కాస్తంత తగ్గినట్టు కనిపించినా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంయమన స్థితి ఎంతో కాలం కొనసాగకపోవచ్చు’’ అన్న మాటల్ని చూస్తే.. వచ్చే నెల నుంచి కట్టాల్సిన ఈఎంఐల గురించి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.