నిలిచిపోయిన రూ. 2వేల‌ నోట్ల ముద్రణ

By సుభాష్  Published on  26 Aug 2020 2:43 AM GMT
నిలిచిపోయిన రూ. 2వేల‌ నోట్ల ముద్రణ

గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.2వేల నోట్ల ముద్రణ నిలిచిపోయిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. అలాగే రెండువేల నోటు చలామణి కూడా మూడేళ్లుగా క్రమంగా తగ్గిపోయిందని స్పష్టం చేసింది. 2018, మార్చి 31 నాటికి చలామణిలో 33,632 లక్షల రెండువేల నోట్లండగా, 2019, మార్చి 31 నాటకి ఇవి 32,910 లక్షల నోట్లకు పడిపోయిందని తెలిపింది. అలాగే 2020, మార్చి 31 నాటికి 27, 398 లక్షల నోట్లకు వచ్చాయని వార్షిక నివేదికలో ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది మార్చి అఖరు నాటికి చలామణిలో ఉన్న నోట్ల విలువలో రూ.2వేల నోట్లు 2.4 శాతానికి మాత్రమే సమానమని తెలిపింది. మరో వైపు మూడేళ్లలో చూస్తే రూ.500, రూ.200 నోట్ల చలామణి గణనీయంగా పెరిగిందని పేర్కొంది.

2019-20లో 1,463 కోట్ల రూ.500 నోట్లను ముద్రించామని, 1,200 కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. రూ.200 (205 కోట్ల నోట్లు), రూ.100 (330 కోట్ల నోట్లు), రూ.50 (240 కోట్ల నోట్లు), రూ.20 (125 కోట్ల నోట్లు), రూ.10 (147 కోట్ల నోట్లు) ముద్రణ చేశామని వివరించింది.

కాగా, కరోనా వైరస్‌ ప్రభావంతో కరెన్సీ నోట్ల చలామణి చాలా పడిపోయిందని ఆర్బీఐ తెలిపింది. దీంతో ముద్రణపై కరోనా ప్రభావం పడినట్లు పేర్కొంది.

నకిలీ నోట్లు

గత ఆర్థిక సంవత్సరం 2,96,695 నకిలీ నోట్లు పట్టబడ్డాయి. వీటిలో ఆర్బీఐ 4.

6శాతంగా గుర్తించగా, మిగతా 95.4శాతం వివిధ బ్యాంకులు కనిపెట్టాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే నకిలీ కరెన్సీ భారీగా పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన రూ.100 నోట్ల ముద్రణలో నకిలీకి తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. గతంతో పోలిస్తే రూ.20,100, 2000 నకిలీ నట్ల ప్రవాహం తగ్గిందని గుర్తు చేసింది. కాగా, నల్లధనం నిర్మూలన, నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేస్తామని 2016లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Next Story