ముగిసిన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 12:47 PM GMT
ముగిసిన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా.. 823 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక.. ఈ నెల 12వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అధికార టీఆర్ఎస్‌ పార్టీ నుంచి సీఎం కూతురు, మాజీ నిజామాబాద్‌ ఎంపీ కవిత బరిలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.

ఇదిలావుంటే.. టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత విజయం ఖరారైనట్టుగా పార్టీ నేత‌లు చెబుతున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్‌లో ప్రజాప్రతినిధులతో పాటు.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న‌ ప్రజాప్రతినిధులకు ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 24 మందికి కరోనా పాజిటివ్‌గా తేల‌గా.. వారిలో 8 మంది కోలుకున్నారు. మిగ‌తా 16 మందిలో 14 మంది పీపీఈ కిట్లతో వచ్చి పోలింగ్ ముగిసే సమయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మ‌రో ఇద్ద‌రు పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

Next Story