భారతీయులకు సహాయం చేయడానికి ప్లాస్మా దానం చేసిన న్యూజిలాండ్ యుట్యూబర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 8:28 AM GMT
భారతీయులకు సహాయం చేయడానికి ప్లాస్మా దానం చేసిన న్యూజిలాండ్ యుట్యూబర్

న్యూ ఢిల్లీ : కార్ల్ రాక్.. న్యూజిలాండ్ కు చెందిన ఓ యుట్యూబర్ గత మూడేళ్లుగా భారత్ లోనే నివాసం ఉంటున్నాడు. అతడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనస్ఫూర్తిగా అభినందించాడు. అందుకు కారణం తన ప్లాస్మాను దానం చేయడమే..! కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతూ ఉంది. దీంతో ప్లాస్మా దానం చేయాలని ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారిని కోరుతూ ఉన్నారు.

ఢిల్లీకి చెందిన న్యూజిలాండ్ వ్యక్తి కార్ల్ రాక్ తన ప్లాస్మాను దానం చేశాడు. అతడు ప్లాస్మా దానం చేసిన వీడియోను మీరు కూడా చూడండి అలాగే అతడు చెప్పేది కూడా వినండి. అతడిని చూసి మరికొంత మంది ప్లాస్మాను దానం చేయడానికి వస్తారని ఆశిస్తూ ఉన్నానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

తనను ఢిల్లీకి చెందిన వ్యక్తి అని అరవింద్ కేజ్రీవాల్ అనడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు కార్ల్ రాక్. కరోనా వైరస్ బారిన పడిన కార్ల్ రాక్ ఇటీవలే కోలుకున్నాడు. తన ప్లాస్మాను దానం చేశాడు. ప్లాస్మా దానం చేయడం అన్నది చాలా మంచిదని.. మన భారతీయులకు సహాయం చేయాలని కోరారు.

నమస్తే ఫ్రెండ్స్.. నాకు కరోనా సోకిందని మీకు తెలిసిందే.. నేను కోలుకున్నా.. ఇప్పుడు నేను ప్లాస్మాను దానం చేయబోతున్నా.. అలా చేయడం ద్వారా తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని కాపాడవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేశాడని తెలియగానే నేను రిజిస్టర్ చేయించుకున్నా.. ప్లాస్మా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపాడు. మన భారతీయులకు సహాయం చేయాలని ఆయన సూచించారు. ప్లాస్మా థెరపీ అన్నది బెస్ట్ ట్రీట్ మెంట్ అని చెప్పుకొచ్చాడు కార్ల్ రాక్.ప్లాస్మా డొనేట్ చేసిన తర్వాత కార్ల్ రాక్ కు ఇతరులకు శాండ్ విచ్ ఇవ్వడమే కాకుండా కొబ్బరి నీళ్లను అందించారు. అరవింద్ కేజ్రీవాల్ సంతకం చేసిన ఓ సర్టిఫికెట్ ను అందించారు.

ఇతరులకు సహాయం చేయడం ఎంతో మంచిగా అనిపించింది అని కార్ల్ రాక్ తెలిపాడు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత రికవర్ అయిన కొద్దిరోజులకు ప్లాస్మాను దానం చేయచ్చని అతడు తెలిపాడు.

ఢిల్లీలో కరోనా వైరస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మెట్రో నగరాల్లో ఎక్కువ కేసులు నమోదైన నగరంగా ఢిల్లీని పరిగణిస్తూ ఉన్నారు. దేశంలోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న మూడో ప్రాంతంగా ఢిల్లీ ఉండడంతో అక్కడి ప్రభుత్వం ప్లాస్మా బ్యాంకును ఈ నెలలో ఏర్పాటు చేసింది.

గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,20,916కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,123కి పెరిగింది. 2,83,407 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకున్నారు.

Next Story
Share it