ప్రధాని మోదీ ఆరు నెలల పాలన ఎలా ఉందంటే..?

By అంజి  Published on  30 Nov 2019 1:09 PM IST
ప్రధాని మోదీ ఆరు నెలల పాలన ఎలా ఉందంటే..?

ఢిల్లీ: భారతదేశ ప్రధానిగా రెండోసారి 2019 మే 30న నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పరిపాలన నేటితో ఆరు నెలలు పూర్తి చేసుకుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి, ప్రధానమంత్రి పదవిని అలంకరించి మొదటి వ్యక్తి నరేంద్రమోదీ. 2014 నుంచి 2019 వరకు దేశ ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు నిర్వర్తించారు. 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

మోదీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిల్చిపోయేలా ఉన్నాయి. పరిపాలనా దక్షత కలిగిన మోదీ.. ఎవరూ ఉహించని విధంగా ఆరు నెలల్లోనే తన మార్క్‌ పాలనను దేశ ప్రజలకు చూపించారు. ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఉగ్రవాద నిరోధక చట్టం, ట్రిపుల్‌ తలాక్‌ చట్టాలను అమలు చేసి మోదీ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. విదేశాల్లోనూ పర్యటిస్తూ ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర దేశాలతో భారత్‌కు సత్సంబంధాల కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. విదేశి వేదికలపై పాలు పంచుకుంటున్న ప్రధాని మోదీ.. భారత్‌ సత్తాను చాటుతున్నారు. ప్రతి నెల మన్‌కీ బాత్‌ కార్యాక్రమాన్ని నిర్వహిస్తూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు దగ్గరవుతున్నారు.

మరోవైపు చారిత్రాత్మక నిర్ణయాల వల్ల దేశం ఆర్థిక మందగమనంలో కూరుకుపోవడం మోదీ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కీలక సంస్కరణలన్నీ ఒక్కసారిగా తేవడంతోనే ఆర్థిక వృద్ధి మందగించిందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థికరంగంలో ముందడగు వేయించేందుకు మోదీ ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. ప్రధాని మోదీ దేశ భద్రతా, సామాజిక సమస్యల దృష్టిపెట్టారు. దీని కారణంగా యువతలో ఆర్థిక అభద్రత భావం పెరుగుతోందని... దీని ప్రభావం బీజేపీ ప్రభుత్వంపై పడే అవకాశాలున్నాయని ఆర్థిక విభాగం చెప్తోంది.

ఇదిలా ఉంటే 2025 నాటికి రూ.5లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. దేశ ప్రజల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ను, ట్రాఫిక్‌ రూల్స్‌ను కఠిన తరం చేస్తూ కొత్తమోటార్‌ వెహికల్‌ చట్టం-2019ను తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం కింద తక్కువ ధరకు వంట గ్యాస్‌ను, రైతులకు పెన్షన్‌ స్కీమ్‌ను మోదీ ప్రభుత్వం అందిస్తోంది. అలాగే పలు ప్లాస్టిక్‌ వస్తువులపై కూడా మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది. అస్సాంలో మోదీ ప్రభుత్వం ఎన్‌ఆర్సీని అమలు చేసింది.

ప్రధాని మోదీ పరిపాలన వల్ల కార్పొరేట్‌ దిగ్గజాలకే మేలు జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేవిధంగా ప్రధాని మోదీ వ్యహరిస్తున్నారని పత్రిపక్షాలు విమర్శిస్తున్నాయి. పార్లమెంట్‌లో తమ గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.

Next Story