పాపం ఢిల్లీని ఊరికే ఆడిపోసుకోకండి..!

By అంజి  Published on  8 Dec 2019 9:00 AM GMT
పాపం ఢిల్లీని ఊరికే ఆడిపోసుకోకండి..!

దేశంలో నేరాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి? దేశ రాజధాని ఢిల్లీలో.... ఇదే నూటికి తొంభై మంది ఇచ్చే జవాబు. కానీ వాస్తవం ఏమిటి? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలను పరిశీలిస్తే ఢిల్లీ కన్నా పలు రాష్ట్ర రాజధానులు ప్రమాదకరం.అక్కడ నేరాలు ఎక్కువ. ముఖ్యంగా దోపిడీలు, డబ్బు కోసం హత్యలు ఈ నగరాల్లోనే ఎక్కువ. కానీ పత్రికల్లో వచ్చే కథనాలు, టీవీల్లో వచ్చే వార్తలు చూసిన వారికి ఢిల్లీయే అత్యంత ప్రమాదకరమని అనిపిస్తుంది. నిజం ఏమిటంటే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ లలోని నగరాలే ప్రమాదకరం.

ఈ గణాంకాలను చూడండి. హత్య లేదా హత్యాయత్నం కేసుల్లో ఢిల్లీది తొమ్మిదో స్థానం. పాట్నా తొలి స్థానంలో, లక్నో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో నాగపూర్ ఉంది. అయిదు, ఆరు, ఏడవ స్థానాల్లో బెంగుళూరు, ఇండోర్, కాన్పూర్ లు ఉన్నాయి. ఎనిమిదో స్థానంలో పుణే ఉంది. ఆస్తి పరమైన తగాదాలు, హింసల విషయంలోనూ తొలి స్థానం ఢిల్లీది కాదు. నాగపూర్ తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్తానంలో ఉన్నాయి. బెంగుళూరు, లక్నో, పుణే, పాట్నాలు మూడు, నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. మైనర్లపై హింసాత్మక దాడుల విషయంలో ఇండోర్ తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. లక్నో, నాగపూర్, పుణే, జైపూర్ లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

షెడ్యూల్డు కులాలు, తెగలపై దాడుల విషయంలోనూ పాట్నా ముందుంది. లక్నో, కాన్పూర్, జైపూర్, బెంగుళూరు, అహ్మదాబాద్ లు వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ పదిహేనో స్థానంలో ఉంది. ఇక ఆర్ధిక నేరాల విషయానికి వస్తే జైపూర్ తొలి స్థానంలో ఉంది. ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. మహిళలపై దాడుల విషయంలోనూ ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. తొలి స్థానంలో లక్నో, రెండో స్థానంలో జైపూర్, మూడో స్థానంలో ఇండోర్ లు ఉన్నాయి. మహిళలపై హింస విషయంలో మాత్రం ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో బెంగుళూరు, మూడో స్థానంలో లక్నో, నాలుతో స్థానంలో పాట్నా ఉన్నాయి.

కాబట్టి ఊరికే ఢిల్లీని ఆడిపోసుకోకండి. శాంతి భద్రతల వంటి చాలా విషయాల్లో రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల కన్నా ఢిల్లీ పరిస్థితే మెరుగ్గా ఉంది.

Next Story