గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌..!

By Newsmeter.Network  Published on  5 Dec 2019 11:56 AM GMT
గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌..!

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ కొద్దిరోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే తన 11 నెలల కుమారుడితో కలిసి ఉంటోంది. రాధిక భర్త ఓ నేర కేసుపై చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దీనికి తోడు వారికి సొంతిల్లు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలీక చాలారోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అక్కడే తింటూ రాత్రిళ్లు అక్కడే పడుకుంటోంది. దీంతో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాధిక కుమారుడిని ఎత్తుకెళ్లిపోయారు. నిద్రమత్తులో రాధిక కొద్దిసేపటి తర్వాత లేచి చూసే సరికి బాబు కనిపించలేదు. దీంతో ఆమె టెన్షన్‌తో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి కిడ్నాప్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అక్కడి ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారెవరైనా బాలుడిని ఎత్తుకెళ్లారా...? లేక పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా పనా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story
Share it