గుడ్‌న్యూస్.. ఆ పథకం కింద లబ్ధిదారులకు రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు
ఆర్థికంగా బలహీనమైన లబ్ధిదారులకు ద్రవ్యోల్బణం నుండి తక్షణ ఉపశమనం కలిగించడానికి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం
By Medi Samrat Published on 31 Oct 2023 7:45 PM ISTఆర్థికంగా బలహీనమైన లబ్ధిదారులకు ద్రవ్యోల్బణం నుండి తక్షణ ఉపశమనం కలిగించడానికి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు మంగళవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయం గురించి ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సమాచారం ఇస్తూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 1,75,04,375 మంది పేద మహిళలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
ఉజ్వల పథకం లబ్ధిదారులందరూ ఆధార్‌ను ధృవీకరించుకోవాలని ఆయన సూచించారు. తొలిదశలో ఆధార్ ధృవీకరణ పొందిన లబ్ధిదారులకు మాత్రమే ఉచిత ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆధార్ ధృవీకరణ సర్టిఫికేట్ పొందాక అందరు లబ్ధిదారులకు ఉచిత LPG సిలిండర్లు పంపిణీ చేయబడతాయని వెల్లడించారు.
దీపావళి, హోలీ సందర్భంగా మహిళా లబ్ధిదారులకు ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉజ్వల యోజన మహిళల లబ్ధిదారులకు అక్టోబర్ నుండి డిసెంబర్-2023 మరియు జనవరి నుండి మార్చి-2024 మధ్య LPG సిలిండర్లు పంపిణీ చేయబడతాయి. ఈ పథకం కింద లబ్ధిదారుడు ప్రస్తుత వినియోగదారు రేటు ప్రకారం చెల్లించి 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ను కొనుగోలు చేయాలి. ఐదు రోజుల తర్వాత సబ్సిడీ మొత్తాన్ని చమురు కంపెనీలు ఆధార్ ధృవీకరించిన ఖాతాకు పంపబడతాయి. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,312 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన ప్రజా సంక్షేమ తీర్మాన లేఖలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం, హోలీ, దీపావళి సందర్భంగా ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లు అందించేందుకు బడ్జెట్‌లో రూ.3301.74 కోట్లు కేటాయించారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం దీన్ని చేయలేకపోయింది.