పెళ్లికి నిరాకరించిన యువకుడిపై ఓ యువతి కక్ష సాధింపు చర్యను చేపట్టింది. అందుకే తన బంధువుల సహాయంతో అతడి ఇంటిని తగలబెట్టించింది. అక్కడితో ఆగని ఆమె అతడి ఆటోను కూడా తగులబెట్టించేసింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బీదర్ జిల్లాలోని బసవకల్యాణ తాలూకా హిప్పరగా గ్రామానికి చెందిన భీమరావు తల్లితో కలిసి సస్తాపూర్ గ్రామ సమీపంలో నివసించేవాడు. అతడికి సుమ అనే యువతితో పరిచయమైంది. పెళ్లి చేసుకుందామని సదరు యువతి అతడిని బలవంతం చేసింది.
ఆమె ఒత్తిళ్లు రోజురోజుకు పెరిగిపోతుండడంతో తట్టుకోలేకపోయిన భీమరావు తల్లిని తీసుకుని బాగ్ హిప్పరగా గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. తనను వివాహం చేసుకోకుంటే తాను చేబదులుగా ఇచ్చిన రూ. 4 లక్షలను తిరిగి ఇచ్చేయాలని సుమ డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడం, తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో సుమ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మనుషులను పంపి భీమరావు ఇంటిని, ఆటోను తగలబెట్టించింది. భీమరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.