మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గుర్తుతెలియని దుండగులు మహిళ ముఖంపై బ్లేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తన ముఖానికి 118 కుట్లు పడ్డాయని ఆ మహిళ తెలిపింది. భోపాల్‌లోని టీటీ నగర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు వైద్యుడి వద్ద పనిచేస్తోంది. ఆ మహిళ తన భర్తతో కలిసి ఏదో పని నిమిత్తం మార్కెట్‌కి వెళ్లింది. మహిళ భర్త నీళ్ల కోసం పక్కకు వెళ్లగా, బైక్‌కు సమీపంలో నిలబడిన మహిళ దగ్గరకు కొందరు అగంతకులు వచ్చి ఆమెపై కామెంట్లు చేయడం ప్రారంభించారు. వారి ఓవరాక్షన్ శృతి మించడంతో మహిళ ఆగ్రహంతో ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టింది.
మహిళకు, నిందితులకు మధ్య వాగ్వాదం జరగడంతో ప్రజలు గుమికూడడంతో దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై మార్కెట్ నుంచి బయల్దేరి వెళ్లగా.. వారిని వెంబడిస్తూ వచ్చారు దుండగులు. ఒకరు మహిళ ముఖంపై పదునైన వస్తువుతో దాడి చేయడంతో నుదురు నుంచి కుడి చెవి వరకు గాయమైంది. ఇద్దరు గుర్తుతెలియని దుండగులపై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ సాయికృష్ణ తెలిపారు. మహిళ ఆసుపత్రిలో ఉందని, అందువల్ల ఆమెకు గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియరాలేదని తెలిపారు. విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.