ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తహసీల్ బిసౌలీ ప్రాంతంలోని ఓ గ్రామంలో గృహ వివాదం తీవ్ర రూపం దాల్చింది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో భర్త ఇంటి బయట ఆ రాత్రంతా విపరీతమైన చలిలో గడపాల్సి వచ్చింది. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. దబ్తోరి ప్రాంతంలోని ఓ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బరేలీకి చెందిన ఓయువకుడు కూలీ పని చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. పని విషయంలో భార్యతో గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో భార్య తన భర్తను ఇంటి నుంచి బయటకు గెంటేసి లోపలి నుంచి తాళం వేసి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో పడుకుంది.
చలికి వణుకుతున్న భర్త రాత్రంతా తలుపు తీయాలని వేడుకున్నా భార్య తలుపు తీయలేదు. దీంతో ఆ యువకుడు 112కి డయల్ చేయడం ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయినప్పటికీ అతడు రాత్రంతా బయట కూర్చోవలసి వచ్చింది. ఉదయం పోలీసులు భార్యను ఒప్పించి, భర్తను ఇంట్లోకి అనుమతించేందుకు వీలు కల్పించడంతో వివాదానికి శుభం కార్డు పడింది. చలి కారణంగా భర్త పని నిమిత్తం బయటకు వెళ్లడాన్ని యువకుడి భార్య వ్యతిరేకిస్తోందని పోలీసులు తెలిపారు. అయితే.. భర్త మాత్రం పనికి వెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.