మే 28 ఆదివారం నాడు ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించాయి. అయితే.. ఈ వేడుకకు మేము హాజరవుతామని సినీ నటుడు, రాజకీయ నాయకుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నామని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. దేశం గర్వించే ఈ తరుణం రాజకీయంగా చిచ్చు రేపిందని కమల్ హాసన్ అన్నారు. మన కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు హాజరు కాకూడదో దయచేసి దేశానికి చెప్పండి అని నేను మన ప్రధానమంత్రిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత రాష్ట్రపతి ఎందుకు భాగం కాకూడదో కారణం నాకు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై నేను విభేదిస్తున్నాని అన్నారు. అసమ్మతి ఉన్నప్పటికీ, మేము ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నామని తెలియజేశారు.