ఎవరీ బాబా శివానంద్.? 126 ఏళ్ల వయస్సులో ఏంటి ఆ చురుకుతనం..?
Who is Baba Sivanand. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బాబా శివానంద్‌ను ప్రశంసించారు. 126 సంవత్సరాల వయస్సులో అతని చురుకుదనం
By Medi Samrat Published on 27 March 2022 4:38 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బాబా శివానంద్‌ను ప్రశంసించారు. 126 సంవత్సరాల వయస్సులో అతని చురుకుదనం, యోగా పట్ల మక్కువ, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆయన చూపించే అంకితభావం స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసారమైన 'మన్ కీ బాత్' 87వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "నా ప్రియమైన దేశప్రజలారా, ఇటీవల జరిగిన పద్మ అవార్డుల వేడుకలో మీరు బాబా శివానంద్ జీని గమనించి ఉంటారు. 126 ఏళ్ల వృద్ధుడి చురుకుదనాన్ని చూసి అందరూ తప్పక నాలాగే ఆశ్చర్యపోయారనుకుంటున్నా.. 126 సంవత్సరాల వయస్సు గల బాబా శివానంద్ ఫిట్‌నెస్ నేడు దేశంలో చర్చనీయాంశమైంది. బాబా శివానంద్ ఫిట్‌నెస్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది వ్యాఖ్యలను నేను చదివాను. నిజానికి బాబా శివానంద జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను. ఆయనకు యోగా పట్ల మక్కువ ఉంది.. ఆయన చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతారని మోదీ అన్నారు.
పద్మశ్రీ అవార్డు ప్రదానోత్సవంలో బాబా శివానంద్ ప్రధాని మోదీకి నమస్కరించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తాయి. మోదీ కూడా సీటులో నుంచి లేచి ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. దీంతో 126 ఏళ్ల బాబా శివానంద ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. స్వామి శివానంద వారణాసికి చెందిన సన్యాసి. పద్మశ్రీ అవార్డు పొందిన అత్యంత వయోవృద్ధుడు. అతను ఆగస్టు 1896లో జన్మించాడు. 126 సంవత్సరాల వయస్సులోనూ ఆయన గంటల తరబడి యోగా చేసేంత దృఢంగా ఉన్నారు. స్వామి శివానంద తెల్లవారుజామున 3 గంటలకే మేల్కొంటారు. మొదటినుండి ఆయన స్థిరమైన దినచర్యకు కట్టుబడి ఉన్నారు. ఆయన నేలపై చాప మీద పడుకుంటారు. చెక్క పలకను దిండుగా ఉపయోగిస్తారు. ఎటువంటి వైద్యపరమైన సమస్యలు లేకుండా ఫిట్‌గా ఉన్న ఆయన ప్రతిరోజూ యోగాను అభ్యసిస్తారు. అన్ని పనులను తానే స్వయంగా చేసుకుంటారు. స్వామి శివానంద సాదాసీదా జీవితాన్ని గడుపుతారు. సాధారణ ఆహారం తీసుకుంటారు.
స్వామి శివానంద పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లోని ఆశ్రమంలో తన గురువు ఓంకారానంద గోస్వామి వద్ద పెరిగారు. శివానందకు గురువు పాఠశాల విద్య కాకుండా యోగాతో సహా అన్ని ఆచరణాత్మక, ఆధ్యాత్మిక విద్యలలో తర్పీదునిచ్చారు. స్వామి శివానంద చిన్నతనంలో పేదరికం వల్ల చాలాసార్లు ఖాళీ కడుపుతో నిద్రపోయారు. పద్మశ్రీ అవార్డు ప్రదానోత్సవంలో బాబా శివానంద్ చిత్రం తెల్లటి కుర్తా, ధోతీ ధరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీకు గౌరవ సూచకంగా మోకరిల్లి.. వంగి నమస్కరించిన ఆయన తీరు ప్రశంసలు అందుకుంది. ప్రధానమంత్రి కూడా సీటుపై నుంచి లేచి ఈ యోగా లెజెండ్‌కు నమస్కరించారు.