కొత్త రాగం అందుకున్న వాట్సప్

Whatsapp Privacy Policy. వాట్సాప్ కొద్ది నెలల కిందట త‌న కొత్త ప్రైవ‌సీ పాల‌సీని ప్ర‌క‌టించింది. ఆ విధానం ప‌ట్ల ప్రపంచ వ్యాప్తంగా

By Medi Samrat  Published on  9 July 2021 5:13 PM IST
కొత్త రాగం అందుకున్న వాట్సప్

వాట్సాప్ కొద్ది నెలల కిందట త‌న కొత్త ప్రైవ‌సీ పాల‌సీని ప్ర‌క‌టించింది. ఆ విధానం ప‌ట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భారత ప్ర‌భుత్వం కూడా వ్య‌తిరేకత వ్య‌క్తం చేసింది. వాట్సప్ త‌న డేటాను పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ పాల‌సీపై ప్ర‌భుత్వం కోర్టుకు వెళ్లింది. ప్రైవ‌సీ పాల‌సీపై స‌మ‌గ్ర‌మైన స‌మాచారం ఇవ్వాల‌ని ఇటీవ‌ల కంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఫేస్‌బుక్‌కు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఫేస్ బుక్ వెనక్కు తగ్గుతున్నట్లు తెలిపింది. డేటా రక్షణ చట్టం అమల్లోకి వచ్చే వరకు భారతదేశంలో తన కొత్త గోప్యతా విధానాన్ని నిలిపివేస్తామని సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ "పాలసీని ఆపాలని ప్రభుత్వం కోరింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చే వరకు మేము దానిని అమలు చేయబోమని చెప్పాము. అది ఓపెన్-ఎండ్ అని.. మాకు బిల్లు ఎప్పుడు బయటకు రాబోతోంది అనే విషయం తెలియదని.. మేము దీన్ని కొంతకాలం ఎదురుచూస్తామని చెబుతున్నాము. ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ బిల్లు చ‌ట్టంగా మారే వ‌ర‌కు ప్రైవ‌సీ పాల‌సీని నిలిపివేస్తున్న‌ట్లు " తెలిపారు. ప్రస్తుతానికి వినియోగదారులను ఈ విషయంలో ఇబ్బంది పెట్టడంలేదని, విధానాలకు అంగీకరించని వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదని తెలిపారు. గోప్యతా విధానాన్ని ఎంచుకోని వినియోగదారుల కోసం కొంతకాలం కార్యాచరణను పరిమితం చేయదని వాట్సప్ జస్టిస్ డి ఎన్ పటేల్, జ్యోతి సింగ్ ధర్మాసనం ముందు చెప్పుకొచ్చింది.


Next Story