అగ్నీపథ్ ను రద్దు చేస్తాం: మల్లికార్జున్ ఖర్గే

మళ్లీ అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేసి, పాత సాయుధ సేవల రిక్రూట్‌మెంట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెడతామని కాంగ్రెస్ సోమవారం హామీ ఇచ్చింది.

By Medi Samrat  Published on  26 Feb 2024 1:45 PM GMT
అగ్నీపథ్ ను రద్దు చేస్తాం: మల్లికార్జున్ ఖర్గే

మళ్లీ అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేసి, పాత సాయుధ సేవల రిక్రూట్‌మెంట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెడతామని కాంగ్రెస్ సోమవారం హామీ ఇచ్చింది. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే అగ్నిపథ్ ద్వారా యువతకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే పాత రిక్రూట్‌మెంట్ విధానాన్ని తిరిగి తెస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అగ్నీపథ్ పథకం కారణంగా సాయుధ బలగాలలో రెగ్యులర్ ఉద్యోగాలు కోరుతున్న యువకులకు ఎంతో అన్యాయం జరిగిందని ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖలో తెలియజేశారు. సాయుధ బలగాలలో రెగ్యులర్ నియామక ప్రక్రియ రద్దు వల్ల సుమారు రెండు లక్షల మంది యువజనులకు భవిత అనిశ్చితంగా మారిందని తన లేఖలో తెలిపారు. నాలుగు సంవత్సరాల సర్వీస్ అనంతరం అగ్నివీర్‌లలో ఎక్కువ మందిని బయటకు పంపిస్తారని.. దాని వల్ల సామాజిక సుస్థిరత ప్రభావితం అవుతుందని ఖర్గే తన లేఖలో వివరించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఖర్గే లేఖను ప్రస్తావిస్తూ.. న్యాయం కోసం పోరాటంలో దేశభక్తి, ధైర్యసాహసాలు పూర్తిగా ఉన్నసైనిక అభ్యర్థులకు మేము దన్నుగా ఉన్నామని తెలిపారు. అగ్నివీర్ పథకం తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువజనుల కలలను బీజేపీ ప్రభుత్వం ఛిద్రం చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు.

Next Story