కొడుకుకి దెయ్యం పట్టిందని కొట్టి చంపేసిన తల్లి
Vellore Mother Killed Her Son. మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామో.. ఇప్పుడు కూడా దెయ్యాలు, భూతాలు అంటూ మూఢనమ్మకాల
By Medi Samrat Published on 22 Jun 2021 2:32 PM IST
మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామో.. ఇప్పుడు కూడా దెయ్యాలు, భూతాలు అంటూ మూఢనమ్మకాల మాటున ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో అలాంటి ఓ దారుణమే చోటు చేసుకుంది. దెయ్యం పట్టిందని కన్న తల్లే కుమారుడిని కర్రతో కొట్టి హత్య చేసింది.
వేలూరు లోని అరియూర్ జేజేనగర్‌కు చెందిన కార్తీ, తిలగవది దంపతులకు కుమారుడు శబరి(7)ఉన్నాడు. కార్తీ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. శబరి ఫిట్స్ తో బాధపడే వాడు. కొన్ని సార్లు వింతగా ప్రవర్తించే వాడు. దీంతో కుటుంబ సభ్యులు శబరికి దెయ్యం పట్టిందని భావించారు. తిరువణ్ణామలై జిల్లా వందవాసికి చెందిన ఓ పూజారి దెయ్యాన్ని తరిమేస్తాడని కొందరు చెప్పడంతో తిలగవది తన చెళ్లెల్లు కవిత, భాగ్యలక్ష్మిలను, కుమారుడు శబరిని తీసుకొని ఆదివారం సాయంత్రం ఆటోలో వెళ్ళింది.
ఆటోకు చెప్పిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆటో డ్రైవర్ కణ్ణమంగళం కొత్త బస్టాండ్ వద్ద నలుగురిని దింపి వెళ్లిపోయాడు. సాయంత్రం చీకటి పడడంతో కణ్ణమంగళం పంచాయితీ కార్యాలయం ముందు నిద్రించారు. సోమవారం వేకువజామున 3 గంటలకు శబరికి ఫిట్స్ రావడంతో.. శబరి శరీరంలో దెయ్యం ఉందని.. ఇతన్ని కొడితే దెయ్యం శరీరం విడిచి వెళ్లిపోతుందని ముగ్గురూ కలిసి బాలుడిని కర్రతో కొట్టారు. అతడు దెబ్బలు తాళలేక మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శబరి మృతికి వారు కొట్టడమే కారణమని.. దెయ్యం తరిమేయడానికే ఈ పని చేశామని చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు.