అల్లం టీ చేసిన ముఖ్యమంత్రి.. తాగిన వారు ఏమన్నారంటే..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అతని సింప్లిసిటీతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో ఘటనతో వార్తల్లో నిలిచారు.
By Medi Samrat Published on 19 Jun 2024 4:13 PM ISTఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అతని సింప్లిసిటీతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో ఘటనతో వార్తల్లో నిలిచారు. ధామి యథావిధిగా మంగళవారం మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను కలిశారు. ధామి ఒక టీ దుకాణం వద్ద ఆగి.. తన చేతులతో అల్లం రుబ్బుకుని టీ చేయడం ప్రారంభించారు. సీఎం టీ చేయడం చూసి పక్కనే ఉన్నవాళ్లు అక్కడికి చేరుకున్నారు. టీ స్టాల్ వద్ద నిలబడిన వారితో ఆయన సమస్యలపై మాట్లాడారు. సీఎం తయారుచేసిన టీని ప్రజలు ఆస్వాదిస్తూ.. ఉత్తరాఖండ్‌కు మళ్లీ ఇలాంటి సీఎం రాలేరని అన్నారు. ముఖ్యమంత్రి తీరును చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు.
అనంతరం అక్కడికి సమీపంలోని యువకులు ఆడుకుంటున్న క్రీడామైదానంపై ముఖ్యమంత్రి కళ్లు పడ్డాయి. ధామి ఆటగాళ్ల మధ్యకు చేరుకుని ఆటకు సంబంధించిన సమస్యలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి క్రీడాకారుల సమస్యలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు.
అనంతరం బీపీ పాండే ఆస్పత్రిని ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడి రోగులను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, నిరంతరం ఆరోగ్య సేవలను మెరుగుపరచాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. మార్నింగ్ వాక్‌లో సామాన్య ప్రజలను కలవడం, వారి సమస్యలను అడగడం, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాన్ని తీసుకోవడం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దినచర్యలో ఒక భాగం. డెహ్రాడూన్‌లో ఉన్నా లేదా ఇతర ప్రదేశాలను సందర్శించినా ధామి మార్నింగ్ వాక్ చేస్తారు. సాధారణ ప్రజలతో ముఖాముఖి కలుసుకుంటారు.