ఆర్కెస్ట్రా షోలలో డ్యాన్స్ చేయడానికి నిరాకరించినందుకు ఉత్తరప్రదేశ్‌లో 35 ఏళ్ల మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ మహిళ తన భర్తపై లంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. జౌన్‌పూర్ జిల్లా ముంగ్రా బాద్‌షాపూర్ ప్రాంతానికి చెందిన మహిళ ఫిర్యాదుపై ఆమె భర్త నసీమ్ అహ్మద్, అతని తల్లి, ఇద్దరు సోదరీమణులపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ భేలుపూర్ ప్రవీణ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 2007లో తనకు నసీమ్‌తో వివాహమైందని.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
2015లో నసీమ్, అతని కుటుంబ సభ్యులు బాధిత మహిళ తండ్రిని రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తరువాత నసీమ్ ఆమెను ఆర్కెస్ట్రా షోలలో నృత్యం చేయమని.. మాంసం వ్యాపారం చేయమని బలవంతం చేయడం ప్రారంభించాడు. దీంతో బలవంతంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసేందుకు తన తల్లి.. నసీమ్ కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇవ్వడం ప్రారంభించిందని ఆ మహిళ తెలిపింది. 2021 ఆగస్టులో నసీమ్, అతని తల్లి మరియు సోదరీమణులు.. డబ్బు సంపాదనకు ఆర్కెస్ట్రాలో నృత్యం చేయడానికి నిరాకరించినందున, మాంసపు వ్యాపారం చేయనందుకు తనను, తన పిల్లలతో పాటు ఇంటి నుండి వెళ్లగొట్టారని ఆమె ఆరోపించింది. అయినా తనను వెనక్కి తీసుకెళ్లాలని భర్త, అత్తమామలను ఫోన్‌లో కోరుతూనే ఉన్నానని మహిళ చెప్పింది. అయితే.. నసీమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అతడు తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని మహిళ చెబుతుంది.