రూ. 45 కోట్ల భారీ మోసం.. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
UP bank manager arrested for Rs 45 crore fraud. రూ.45 కోట్లు ఎగ్గొట్టిన కేసులో రెండేళ్లుగా పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్‌ను
By Medi Samrat Published on 1 Feb 2022 10:35 AM ISTరూ.45 కోట్లు ఎగ్గొట్టిన కేసులో రెండేళ్లుగా పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అఖిలేష్ కుమార్ (42)పై కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్‌లో కెనరా బ్యాంక్ (విపిన్ ఖండ్) ప్రాంతీయ కార్యాలయ అధిపతి మనోజ్ కుమార్ మీనా కేసు నమోదు చేశారు. నిందితుడు అలంబాగ్ బ్రాంచ్ ఆఫీస్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న సమయంలో మోసానికి పాల్పడ్డాడు. ఈ నేరంలో అఖిలేష్ కుమార్ పేరు బయటికి రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆచూకీ లభించలేదు.
సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అపర్ణ కౌశిక్.. అఖిలేష్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 25,000 రూపాయల రివార్డును ప్రకటించారు. కానీ అతని ఆచూకీ కనుగొనబడలేదు. "అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మేము అతన్ని పరారీలో ఉన్నట్లు ప్రకటించాము" అని కృష్ణ నగర్ ఏసీపీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే.. కృష్ణా నగర్ ప్రాంతంలోనే అఖిలేష్ కుమార్ ఉన్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందడంతో అధికారులు బృందంతో గాలించి అతన్ని పట్టుకున్నారు. అఖిలేష్ కుమార్ నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను భూములు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగించినట్లు వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
అఖిలేష్ కుమార్ బ్రాంచ్ మేనేజర్‌గా ఉన్నప్పుడు.. మనోజ్ కుమార్, రాజ్ దుగ్గల్, అమిత్ దూబే, సంజయ్ అగర్వాల్‌గా గుర్తించబడిన కొందరు వ్యక్తులు 2019లో అతని బ్రాంచ్‌లో ఖాతాలు తెరిచినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పేరిట రూ.41 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) చేయాలనుకుంటున్నట్లు వారు అఖిలేష్ కుమార్‌కు చెప్పారు. తరువాత సతీష్ త్రిపాఠి, అమిత్ తివారీ, ఓం ప్రకాష్, ప్రభాత్ శ్రీవాస్తవ అనే నలుగురు వ్యక్తులు అఖిలేష్ కుమార్‌ను కలుసుకున్నారు. వారి ఖాతాకు ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని బదిలీ చేయడానికి రూ. 1.25 కోట్ల లంచం ఇచ్చారు. "ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ కావడానికి ముందు.. వారు ఆ డబ్బును తిరిగి ఇస్తామని అఖిలేష్ కుమార్‌కు హామీ ఇచ్చారు" అని పోలీసులు తెలిపారు. అయితే.. ఎఫ్‌డి చేసిన అసలు డిపాజిటర్లు మెచ్యూరిటీకి ముందే తమ డబ్బును డిమాండ్ చేయడంతో అఖిలేష్ కుమార్.. సతీష్ త్రిపాఠి, అమిత్ తివారీ ల వద్దకు వెళ్లాడు. దీంతో అమిత్ వారి వద్ద నుండి రూ. 25 కోట్లు తిరిగి పొందాడు. కాని అసలు డిపాజిటర్లు మోసాన్ని గ్రహించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం అఖిలేష్ కుమార్‌ను ఆ శాఖ నుంచి బదిలీ చేశారు. తర్వాత దోషిగా తేలడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు.