15-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేయడం ప్రారంభించినందున.. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ టీకాను తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని తగిన అర్హత కలిగిన విద్యార్థులను కోరారు. అదే సమయంలో వారి తోటివారు, ఇతరులను కూడా అదే విధంగా చేయమని ప్రోత్సహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ట్వీట్ ద్వారా వ్యాక్సిన్ వేసుకోవాలని విద్యార్థులను కోరారు. 'ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేయడం ప్రారంభించింది' అని హిందీలో ట్వీట్ చేశారు.
"పాఠశాల, కళాశాలకు వెళ్లే అర్హతగల విద్యార్థులందరూ టీకాను తీసుకోవాలని, ఇతరులకు కూడా స్ఫూర్తినివ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను. దీనితో మీరు మిమ్మల్ని, ఇతరులను సురక్షితంగా ఉంచుకోవచ్చు." అని కేంద్ర విద్యా మంత్రి తెలిపారు. కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళనల మధ్య 15-18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌ను స్వీకరించడానికి అర్హులు అని ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 25 న ప్రకటించారు.
భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన 'కోవాక్సిన్' మాత్రమే 15 -18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులకు టీకాలు వేయడానికి ఉపయోగించబడుతుందని గమనించాలి. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక గమనికను కూడా పంపింది. దీని ప్రకారం టీనేజ్ వారికి వ్యాక్సిన్‌లను ఇవ్వడానికి రాష్ట్రాలకు అదనపు మోతాదులను పంపాలి.