మహిళల పెళ్లి వయసు 21కి పెంచాలంటూ పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

Uniform Marriage Age For Men And Women in India. పురుషులతో సమానంగా మహిళల కనీస పెళ్లి వయసును 21కి పెంచాలంటూ సుప్రీంకోర్టులో

By Medi Samrat
Published on : 20 Feb 2023 9:15 PM IST

మహిళల పెళ్లి వయసు 21కి పెంచాలంటూ పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

పురుషులతో సమానంగా మహిళల కనీస పెళ్లి వయసును 21కి పెంచాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా.. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దేశంలో పురుషులు వివాహం చేసుకునేందుకు కనీస వయసు 21 కాగా, మహిళల వివాహానికి కనీస వయసు 18. ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషులకు వివాహ వయస్సులో చట్టబద్ధమైన సమానత్వాన్ని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. స్త్రీ, పురుషుల పెళ్లి వయస్సులో వ్యత్యాసం వల్ల లింగ సమానత్వం, న్యాయపరంగా, మహిళల గౌరవానికి సంబంధించిన అంశాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో స్త్రీ, పురుషుల వివాహానికి కనీస వయో పరిమితి విధించడం మహిళ పట్ల వివక్షను కొనసాగించడమేనని పిటిషనర్‌ ఆరోపించారు. పితృస్వామ్య మూస పద్ధతుల ఆధారంగా పురుషులకు కనీస పెళ్లి వయసు 21గా, స్త్రీలకు 18గా నిర్ణయించారని విమర్శించారు. ఎలాంటి శాస్త్రీయత లేని ఈ నిర్ణయం, న్యాయపరంగా, వాస్తవాలకు విరుద్ధంగా, ప్రపంచ వ్యాప్త పరిస్థితులకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ వ్యత్యాసం వైవాహిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నదని, దంపతుల మధ్య ఘర్షణలను తీవ్రం చేస్తున్నదని.. సంబంధిత చట్టాన్ని సవరించాలని కోర్టును అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ విషయమై పార్లమెంట్‌కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కొన్ని అంశాలు పార్లమెంటుకు చెందుతాయని.. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవని ధర్మాసనం పేర్కొంది.


Next Story