జైల్లో ఖైదీల మధ్య చిగురించిన‌ ప్రేమ.. పెరోల్‌పై విడుద‌లై పెళ్లి..!

రాజస్థాన్‌లోని రెండు ప్రముఖ హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న హనుమాన్ ప్రసాద్, ప్రియా సేథ్ అనే నిందితుల మ‌ధ్య ప్రేమ చిగురించింది.

By -  Medi Samrat
Published on : 24 Jan 2026 8:14 AM IST

జైల్లో ఖైదీల మధ్య చిగురించిన‌ ప్రేమ.. పెరోల్‌పై విడుద‌లై పెళ్లి..!

రాజస్థాన్‌లోని రెండు ప్రముఖ హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న హనుమాన్ ప్రసాద్, ప్రియా సేథ్ అనే నిందితుల మ‌ధ్య ప్రేమ చిగురించింది. దీంతో 15 రోజుల పెరోల్‌పై శుక్రవారం విడుదలైన ఈ జంట‌ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా జైపూర్‌లోని సంగనేర్‌లో ఉన్న ఓపెన్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. దాదాపు ఆరు నెలలుగా వారిద్దరూ సన్నిహితంగా ఉంటూ ప్రేమాయణం సాగించారు. జైలులోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించడం ప్రారంభించారు.

అంత‌ముందు అల్వార్ నివాసి అయిన‌ హనుమాన్ తన కంటే 10 ఏళ్లు పెద్దదైన వివాహిత సంతోషి శర్మతో 2014లో ప్రేమ వ్యవహారం నడిపాడు. 2017 అక్టోబర్ 2న హనుమాన్‌ సంతోషితో కలిసి నిద్రిస్తున్న భర్త బన్వారీని, వారి నలుగురు పిల్లలను కత్తితో పొడిచి చంపాడు. విచారణ అనంతరం వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంపై హనుమాన్‌కు జీవిత ఖైదు పడింది.

అదే సమయంలో, పాలి జిల్లాకు చెందిన ప్రియ, తన ప్రేమికుడు దీక్షాత్ కమ్రా రుణం తీర్చుకునేందుకు డేటింగ్ యాప్ ద్వారా జైపూర్‌లోని జోత్వారా నివాసితో స్నేహం చేశారు. మే 2, 2018న ప్రియ తన ప్రేమికుడు, అతని స్నేహితుడితో కలిసి అత‌డిని తన గదికి పిలిచి బందీగా ఉంచుకుంది. పట్టుబడతామనే భయంతో ముగ్గురూ క‌లిసి బందీ అయిన వ్య‌క్తి తండ్రి నుంచి రూ.3 లక్షల డ‌బ్బు తీసుకుని ఆపై అత‌డిని దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి కొండల్లో పడేశారు. విచారణ అనంతరం పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసుల్లో కోర్టుల‌ ఆదేశాల మేరకు హనుమాన్ ప్రసాద్, ప్రియలను ఓపెన్ జైల్లో ఉంచారు.

హ‌నుమాన్‌ న్యాయవాది విశ్రమ్ ప్రజాపత్ మాట్లాడుతూ.. జనవరి 7 న, రాజస్థాన్ హైకోర్టు అతని దరఖాస్తుపై ఏడు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని పెరోల్ కమిటీని ఆదేశించిందని చెప్పారు. ఆ తర్వాత పెరోల్ మంజూరైంది. ఆల్వార్ జిల్లాలోని బరోడా మియో గ్రామంలో వీరిద్దరూ మొదట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కోసం కార్డులు కూడా ప్రింట్ చేశారు కానీ అకస్మాత్తుగా వివాహ వేదికను జైపూర్ జిల్లాలోని సంగనేర్‌కు మార్చారు. ముందుగా అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా తర్వాత ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగే ప్రదేశం ఎవరికీ చెప్పలేదు.

ప్రియా జైపూర్ సెంట్రల్ జైలులో మే 17, 2018 నుండి జీవిత ఖైదు అనుభవిస్తోంది. ఒక సంవత్సరం క్రితం ఆమెను ఓపెన్ జైలుకు పంపారు. ఆమె మాజీ ప్రేమికుడు దీక్షంత్ కమ్రాను కూడా అదే జైలుకు పంపారు. కానీ ఇక్కడ ప్రియా అతనిని దూరం పెట్టింది. మరోవైపు హనుమాన్ ప్రసాద్, అతని ప్రియురాలు సంతోష్ కూడా జైలుకు వెళ్లి విడిపోయారు.

Next Story