పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన చొరబాటుదారులు హతమయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించగా.. బీఎస్‌ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో స్మగ్లర్లు జవాన్లపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరుపగా.. ఇద్దరు బంగ్లాదేశీయులు మృతి చెందారు. స్మగ్లర్లు సరిహద్దుల్లోని ఏర్పాటు చేసిన కంచెను దాటేందుకు ఇనుప రాడ్లను వినియోగిస్తున్నట్లు బలగాలు గుర్తించాయి.
సరిహద్దు కంచె, రోడ్డు ప్రాజెక్టులు, బోర్డర్ అవుట్ పోస్ట్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల నిర్మాణం కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై చర్చించడానికి యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ హెచ్‌కె ద్వివేదిని కలవడానికి ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. అజయ్ భల్లా పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్‌ఎఫ్ బీఎస్‌ఎఫ్ అధికార పరిధిని పెంచడం సహా పలు అంశాలపై బెంగాల్‌కు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.
"శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు బంగ్లాదేశ్ వైపు నుండి దుండగులు భారత భూభాగంలోకి ప్రవేశించి, వెదురు కాంటిలివర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పశువులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు. మొదట్లో బీఎస్ఎఫ్ హెచ్చరించినా పట్టించుకోలేదు. స్మగ్లర్లు పదునైన ఆయుధాలు మరియు కర్రలతో బీఎస్ఎఫ్ దళాలపై దాడి చేశారు. ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పసిగట్టిన BSF కాల్పులు జరిపింది" అని BSF ఒక ప్రకటనలో తెలిపింది.