దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే పెట్రోల్ ధరలను తగ్గిస్తూ తమిళనాడు సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది స్టాలిన్ సర్కారు. తమ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లినా పర్వాలేదని, సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్దమైందని ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలిపారు. అందుకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని.. అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
దేశంలో పెట్రోలో ధరలో 36 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్నులు ఉండగా దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)లను విధిస్తున్నాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా పెట్రోలు రేటు వంద మార్క్‌ని దాటేయడంతో సామాన్యులు లబో దిబో అంటున్నారు. ధరల తగ్గింపుకు ముందు చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 102.49గా ఉంది. మూడు రూపాయల తగ్గింపుతో పెట్రోలు ధర వందకు దిగువకు రానుంది. ధరల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.