భారత్‌లో టిక్‌టాక్ అన్‌బ్లాక్ కాలేదు.. అవి పుకార్లే..!

చైనీస్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం అన్‌బ్లాక్ చేయలేదు.

By Medi Samrat
Published on : 23 Aug 2025 8:06 AM IST

భారత్‌లో టిక్‌టాక్ అన్‌బ్లాక్ కాలేదు.. అవి పుకార్లే..!

చైనీస్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం అన్‌బ్లాక్ చేయలేదు. అలాగే ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. టిక్‌టాక్ అన్‌బ్లాక్ చేయబడిందని తప్పుడు వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. భారతీయులు ఎలాంటి వదంతుల బారిన పడకుండా ఉండాలి. వినియోగదారులు ఇప్పుడు టిక్‌టాక్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చని వార్త‌లు రాగా.. ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.

2020 సంవత్సరంలో గాల్వన్ వ్యాలీలో చైనా, భారత్‌ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఈ సంఘటన తర్వాత దేశ భద్రతకు ముప్పును పరిగణనలోకి తీసుకుని, చైనా యాప్ టిక్‌టాక్, వీచాట్, హెలోతో సహా అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ అప్లికేషన్‌లను కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నిషేధించింది. ఈ నిషేధం గత 5 సంవత్సరాలుగా అమలులో ఉంది.

ఇప్పుడు భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. భారత్‌, చైనా మధ్య విమానాలు, వీసా సేవలు కూడా పునఃప్రారంభించబోతున్నాయి. భారత్‌, చైనాల మధ్య పర్యాటకులు, వ్యాపారాలు, వ్యాపారులు, మీడియా, ఇతరుల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మూడు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు.

టియాంజిన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ అనేక మంది చైనా నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించడం ద్వారా ప‌లు విషయాలను మెరుగుపరచవచ్చని బావిస్తున్నారు.

TikTok అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్. దీనికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. టిక్‌టాక్ 2020లో భారత్‌లో నిషేధించబడింది. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు కూడా ప్రాచుర్యం పొందాయి.

Next Story