జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ జాతీయుడని ఓ అధికారి తెలిపారు. ఉగ్రవాదుల నుండి 2ఎమ్-4 కార్బైన్‌లు, 1 ఎకే సిరీస్ రైఫిల్‌తో సహా నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీపీ కాశ్మీర్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహమ్మద్ టెర్రరిస్టు(జెఇఎమ్) గ్రూప్‌కు చెందిన వారిగా గుర్తించారు. అంతకుముందు పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చంద్‌గామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందింది. ఆ వెంటనే అక్కడ భద్రతా బలగాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అది ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసు అధికారి తెలిపారు.
నిన్న కూడా జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది చనిపోయాడు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో కుల్గాంలోని ఒకాయ్ గ్రామంలో సైనికులు, కశ్మీర్ పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. ఉగ్రవాదులను భద్రతా దళాలు సమీపించగానే కాల్పులు జరిపారు. దీంతో అలర్ట్ అయిన సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. రెండు వైపుల నుంచి హోరాహోరీ కాల్పుల అనంతరం ఒక ఉగ్రవాది మరణించాడు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.