ఏదైనా లిమిట్ లో మాత్రమే చేయాలని అంటారు. లిమిట్ దాటితే ఏదైనా ప్రమాదకరమే..! ఇక మద్యం మరింత ప్రమాదకరం. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని భివాపూర్ తహసీల్‌లో ఓ వ్యక్తి మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా కాపాడలేకపోయారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సదరు వ్యక్తి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడు విపరీతంగా మద్యం సేవించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. మృతుడు ఆశిష్ తహసీల్‌లోని మారుపర్ నివాసి. ఓ పెళ్లికి హాజరయ్యాడు. అక్కడే అతడు విపరీతంగా మద్యం సేవించాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. ఎంత ప్రయత్నించినా అతనికి స్పృహ రాలేదు. 27 ఏళ్ల ఆశిష్‌ని స్నేహితులు హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే చికిత్స చేస్తుండగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్‌లోని భాగల్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సంఘటన లోదీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపించారు.