రేపు సీడబ్ల్యూసీ కీలక మీటింగ్..ఎల్లుండి కొత్త ఉపాధి చట్టంపై దేశవ్యాప్త ఆందోళనలు
రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.
By - Knakam Karthik |
రేపు సీడబ్ల్యూసీ కీలక మీటింగ్..ఎల్లుండి కొత్త ఉపాధి చట్టంపై దేశవ్యాప్త ఆందోళనలు
ఢిల్లీ: రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ-జీ, రామ్-జీ చట్టంలోని మౌలిక లోపాలపై చర్చించి, దేశ వ్యాప్త ఆందోళనలకు సీడబ్ల్యూస సమావేశంలో ఖరారు చేయనున్నారు.
ఆదివారం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహత్మాగాంధీ చిత్రపటాలతో మండల, గ్రామ స్థాయిల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పని చేసే హక్కు, శ్రమ గౌరవం, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. “హర్ హాత్ కో కామ్ దో, కామ్ కో పూరా దామ్ దో” అనే హామీ తో ప్రజల ఆందోళన, పోరాటం నుంచి పుట్టిన చట్టం “మనెరగా” (జాతీయ ఉపాధి హామీ పధకం) అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కాగా ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టానికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో మహాత్మగాంధీ ప్రతిష్టను, వారసత్వాన్ని ఎన్డీయే ప్రభుత్వం తుడిచివేసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.
పార్లమెంటరీ స్ధాయి సంఘం సిఫారసు మేరకు, ఏడాదిలో రోజుకు 140 రూపాయల వేతనంతో, మొత్తం 150 పనిదినాలు కల్పించాల్సిన ఆవశ్యకతను సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చర్చించనుంది. కొత్త చట్టం వల్ల కలిగే నష్టాలను తెలియజేసే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా గ్రామాల వరకు తీసుకెళ్లాని కాంగ్రెస్ యోచిస్తోంది.