రూ. 20 ల‌క్ష‌ల‌ లంచం డ‌బ్బుల‌ను కాల్చి బూడిద చేసిన అధికారి..

Tehsildar burns currency notes worth Rs 20 lakh due to THIS reason. అవినీతి పాల్ప‌డ్డ ఓ అధికారి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేయ‌డంతో సాక్ష్యం దొర‌క‌కుండా ఉండాల‌ని ఏకంగా 20 లక్షల వరకు కాల్చి బూడిద చేశాడు‌

By Medi Samrat
Published on : 26 March 2021 5:50 PM IST

Tehsildar burns currency notes worth Rs 20 lakh due to THIS reason

అవినీతి పాల్ప‌డ్డ ఓ అధికారి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేయ‌డంతో సాక్ష్యం దొర‌క‌కుండా ఉండాల‌ని ఏకంగా 20 లక్షల వరకు కాల్చి బూడిద చేశాడు‌. వివ‌రాళ్లోకెళితే.. రాజస్థాన్ లోని సిరోహీ జిల్లాలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా పర్వత్ విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే.. బుధవారం సాయంత్రం పర్వత్.. ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును లంచంగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం ఆర్ఐ పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించగా.. జ‌రిగినదాంట్లో త‌న‌ తప్పేమీ లేదనీ.. తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ కారణంగానే తాను ఈ డబ్బును తీసుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో ఏసీబీ అధికారులు ప‌ర్వ‌త్‌ను తీసుకుని.. తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి బయలు దేరారు. అయితే.. ఈ విష‌యం తహసీల్దార్ కు ఎవరో ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు తీసుకున్న లంచంతో పాటు.. గ‌తంలో పుచ్చుకున్న వాయినాల‌ను ఎక్క‌డ దాచాలో తెలియక సతమతమయ్యాడు. చివరకు కాల్చి పడేస్తే పీడా పోతుందని ఓ నిర్ణయానికి వచ్చి.. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డబ్బును కాల్చడం మొదలు పెట్టాడు.

అలా.. రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్లను కాల్చేశాడు. ఈ లోపు కల్పేశ్ ఇంటికి చేరుకున్న‌ ఏసీబీ అధికారులు.. అతడు వంటింట్లో చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. తలుపులు పగలగొట్టి క‌ల్పేశ్‌ నిర్వాకాన్ని ఆపేశారు. అయితే.. ఆలోపే రూ. 20 లక్షల వరకు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. కేసు న‌మోదు చేసిన అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన‌ వీడియోను ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో వైర‌ల్‌‌ అయ్యింది.


Next Story