స్కూల్స్ బంద్.. ఆదివారాలు పూర్తిస్థాయి లాక్ డౌన్
Tamil Nadu to impose Sunday lockdown, close schools. కోవిడ్ -19 వ్యాప్తిని తగ్గించడానికి తమిళనాడు ప్రభుత్వం ఆదివారం నాడు లాక్‌డౌన్
By Medi Samrat Published on 5 Jan 2022 4:05 PM IST
కోవిడ్ -19 వ్యాప్తిని తగ్గించడానికి తమిళనాడు ప్రభుత్వం ఆదివారం నాడు లాక్‌డౌన్ విధించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా స్థలాలకు ప్రజల ప్రవేశంపై నిషేధం విధించడమే కాకుండా.. పాఠశాలలను మూసివేయడం వంటి ఆంక్షలను తీసుకుని వస్తున్నట్లు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. కరోనా కట్టడికి ఆంక్షలు పెంచాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఆదివారం నిర్వహించే మెగా టీకా శిబిరాలు ఇకపై శనివారాల్లో నిర్వహించనున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచే బెంగళూరు నగరంలో కఠిన ఆంక్షలు ప్రారంభమవనున్నాయి. రెండు వారాలపాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. రాజధాని బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నారు.
నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలు మినహా మిగిలినవాటికి అనుమతులు ఉండవు. వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 6 వరకు కొనసాగుతుంది. మాల్స్, థియేటర్లు, పబ్‌లు, హోటళ్లు, బార్లలో 50 శాతం సీట్లకే అనుమతులు మంజూరు చేయనున్నారు. జాతరలు, బహిరంగ సభలు, ర్యాలీలు, అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను రద్దు చేశారు. గురువారం నుంచి 10, 12 తరగతులు మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యాసంస్థలను రెండువారాల పాటు మూసివేయాలని నిర్ణయించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అన్ని సినిమా థియేటర్లలో మంగళవారం నుంచి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. ఇదే విధంగా వాణిజ్య సంస్థలు, నగలు, వస్త్రాల దుకాణాల్లో కూడా 50 శాతం కస్టమర్లను మాత్రమే అనుమతించాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు.