స్కూల్స్ లో ఇక ఉచితంగా టిఫిన్ కూడా..!
Tamil Nadu govt launches breakfast scheme for students. తమిళనాడు ప్రభుత్వం బుధవారం నాడు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’
By Medi Samrat Published on 27 July 2022 6:16 PM IST
తమిళనాడు ప్రభుత్వం బుధవారం నాడు 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' లాంఛనంగా మొదటి దశను ప్రారంభించింది. ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 1.14 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు.ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను చదివేలా ప్రోత్సహించేందుకు, వారిలో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సృష్టించింది. ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని ఉచితంగా అందజేస్తుందని మే నెలలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు. రాబోయే రోజుల్లో దశలవారీగా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
చాలా మంది విద్యార్థులు తమ పాఠశాలలకు ముందుగానే చేరుకోవడానికి అల్పాహారం మానేస్తున్నారని.. కొంతమంది విద్యార్థుల కుటుంబ పరిస్థితి అల్పాహారం తీసుకోకుండా అడ్డుకుంటోందని, అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని స్టాలిన్ పేర్కొన్నారు. కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఇతర మారుమూల ప్రాంతాల్లోని 1,545 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నామని.. 1,14,095 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి ఇరై అన్బు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.33.56 కోట్లు కేటాయించింది.