నీట్ (వైద్య విద్య ప్రవేశ్ పరీక్ష) ఫలితాల ప్రకటించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. విద్యార్థుల పరీక్షా ఫలితాలను ప్రకటించొచ్చని ఎన్‌టీఏకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇద్దరు విద్యార్థుల నీట్ ఫలితాల విడుదలను ఆపలేమని తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. మహారాష్ట్రలో నీట్ పరీక్షకు హాజరైన ఇద్దరు విద్యార్థులు హాజరుకాగా.. ఎగ్జామ్ హాల్‌లో వారి టెస్టు బుక్‌లెట్, ఓఎంఆర్ షీట్లు తారుమారు అయ్యాయి. దీంతో విద్యార్థులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. నీట్ ఫలితాల విడుదలపై స్టే విధించింది. ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏను ఆదేశించింది.
ఫలితాల విడుదల ఆలస్యమైతే అది విద్యార్థుల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది. ముంబై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ.. ఎన్‌టీఏకు ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 16 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను.. కేవలం ఇద్దరి కోసం ఆపలేమని చెప్పింది. అయితే ఇద్దరు విద్యార్థుల సమస్యను మళ్లీ పరిశీలిస్తామంటూ తదుపరి విచారణ నవంబరు 12కి వాయిదా వేసింది. నీట్ పరీక్ష ఈ సంవత్సరం గందరగోళంగా మారింది. పలు రాష్ట్రాల్లో నీట్ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్రం సీబీఐ విచారనకు సైతం ఆదేశించింది. మరికొందరు నీట్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది కూడా.