పెద్ద నోట్ల రద్దు : ఆర్బీఐకు సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

Supreme Court’s Constitution Bench Seeks Centre, RBI Response On Demonetisation. పెద్ద నోట్ల రద్దు.. దేశ చరిత్రలోనే ఒక సరికొత్త ఘట్టం అని తెలిసిందే..!

By Medi Samrat  Published on  12 Oct 2022 4:43 PM IST
పెద్ద నోట్ల రద్దు : ఆర్బీఐకు సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

పెద్ద నోట్ల రద్దు.. దేశ చరిత్రలోనే ఒక సరికొత్త ఘట్టం అని తెలిసిందే..! అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు విష‌యంపై చేసిన కసరత్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై నవంబరు 9న విచారణ జరుపుతామని తెలిపింది. పెద్ద నోట్లను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకునేందుకు చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.

ప్రధాని మోదీ 2016 నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై సెప్టెంబరు 28న విచారణ జరిగింది. అటార్నీ జనరల్ ఆర్ వేంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ అంశం విద్యా సంబంధిత అంశంగా మారిందని, పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయిందని అన్నారు. వెంటనే సీనియర్ అడ్వకేట్లు పి చిదంబరం, శ్యామ్ దివాన్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు.


Next Story