నిన్న నిర్దోషి అని తీర్పు.. నేడు ఊహించని షాక్
Supreme Court Stays Release Of Prof GN Saibaba. ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో శనివారం షాక్ తగిలింది.
By Medi Samrat Published on 15 Oct 2022 8:15 PM ISTఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో శనివారం షాక్ తగిలింది. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనతోపాటు ఐదుగురు నిర్దోషులని బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శనివారం నిలిపేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం నాగ్‌పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సాయిబాబా, మరో ఐదుగురి విడుదలపైనా సుప్రీంకోర్టు స్టే విధించింది. తన వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని గృహ నిర్బంధంలో ఉంచాలన్న సాయిబాబా అభ్యర్థనకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
సాయిబాబా తదితరులు నిర్దోషులంటూ శుక్రవారం నాగ్‌పూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా.. శనివారం అయినా ఈ పిటిషన్‌ను ప్రత్యేక పిటిషన్‌గా పరిగణించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మహారాష్ట్ర వాదనతో ఏకీభవించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం నాగ్‌పూర్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. మహారాష్ట్ర పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ సాయిబాబా తదితరులకు కోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ప్రొఫెసర్ సాయిబాబా తరపున సీనియర్ అడ్వకేట్ బసంత్ వాదనలు వినిపించారు. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాను ఏడేళ్ళ నుంచి జైలులో ఉంచారని తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జైలు బయట, ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రొఫెసర్ సాయిబాబా 2014 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. గడ్చిరోలి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీనిపై ఆయన 2017లో హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం ఆయన నాగపూర్ జైలులో ఉన్నారు.