దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేసింది. 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ విధానం సరిగా లేదని.. కొందరికే వ్యాక్సిన్ వేయడం సహేతుకం కాదని పేర్కొంది.
ఈ నేఫథ్యంలోనే వ్యాక్సిన్ల కొనుగోళ్లపై బుధవారం సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి తెలిపింది. టీకాలు వేసిన జనాభా శాతం( సింగిల్, డబుల్ డోసులు) డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు టీకాలు వేసుకున్న జనాభా శాతాన్ని తెలపాలని కేంద్రానికి స్పష్టం చేసింది.
ఇదిలావుంటే.. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 20,19,773 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,32,788 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,07,832 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 3,207 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,35,102 లకు చేరింది. నిన్న 2,31,456 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,61,79,085 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. టీకా డ్రైవ్‌లో 21,85,46,667 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.