ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు, మ్యారేజ్ సర్టిఫికెట్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఆ సంస్థ ఇస్తున్న సర్టిఫికెట్లను గుర్తించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్య సమాజ్ ఉన్నది పెళ్లిళ్లు చేయడానికి కాదని.. ఇకపై ఆర్య సమాజ్ ఇచ్చే వివాహ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి ధర్మాసనం.. ఆర్యసమాజ్ పని, అధికార పరిధి వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం కాదని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సమర్థవంతమైన అధికారులు మాత్రమే వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయగలరని ధర్మాసనం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ప్రేమ వివాహానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక కుటుంబం ఓ యువకుడు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె మైనర్ అని పేర్కొంది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ ఆ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ బాలిక మేజరేనని.. ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వచ్చేసి తనను పెళ్లి చేసుకుందని యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తమ వివాహం ఆర్య సమాజ్ మందిర్‌లో జరిగిందని చెప్పి, ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బి.వి. నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఆ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించింది.