రాజద్రోహ చట్టం అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు

Supreme Court puts sedition law on hold. రాజద్రోహం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని ప్రస్తుతం నిలుపుదల చేస్తూ

By Medi Samrat  Published on  11 May 2022 9:37 AM GMT
రాజద్రోహ చట్టం అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు

రాజద్రోహం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని ప్రస్తుతం నిలుపుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ NV రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన ప్రత్యేక ధర్మాసనం గత కొన్ని రోజులుగా ఈ చట్టంపై వాదనలు వింటోంది. వలస రాజ్యం నాటి ఈ చట్టాన్ని పునః సమీక్షించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ సమయంలోనూ వలసవాద రాజద్రోహ చట్టం మనకు అవసరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 124A కింద నమోదైన కేసులన్నింటి విచారణను నిలుపుచేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆర్డర్స్ పాస్‌ చేసింది. అంతే కాదు ఈ చట్టంపై నిర్ణయం తీసుకునేంత వరకు కొత్తగా ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని కేంద్రాన్ని సూచించింది. రాజద్రోహం కేసు శిక్ష అనుభవిస్తున్న వారు తగిన కోర్టులను ఆశ్రయించి బెయిల్‌ పొందవచ్చని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తే బెయిల్‌ పొందేందుకు వీలు ఉండదు. ఈ సెక్షన్‌ కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించే వెసులుబాటు కూడా చట్టంలో ఉంది.

బ్రిటీష్‌వారి పాలనలో స్వాతంత్ర్య సమరయోధులను కట్టడి చేసేందుకు అప్పటి బ్రిటీష్‌ పాలకులు ఈ చట్టాన్ని ప్రయోగించారు. 1897లో మొదటిసారి బాలగంగాధర్‌ తిలక్‌పై రాజద్రోహం కేసు మోపారు. మూడు వేర్వేరు విచారణలు నిర్వహించి ఆయనను రెండుసార్లు జైలుకు పంపించారు. మహాత్మా గాంధీపై కూడా రాజద్రోహం నేరం మోపారు. ఎంతో మంది స్వాతంత్య్ర యోధులపై ఈ రాజద్రోహం కేసులు నమోదు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా ఈ చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేశాయి. ఈ సెక్షన్ కింద నమోదైన కేసులకు బెయిల్‌ లభించదు. కాని, ఈ కేసుల్లో శిక్ష పడే కేసులు చాలా తక్కువ. రాజద్రోహ కేసుల నమోదు అస్సాం ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఝార్ఖండ్‌, హరియాణా రాష్ట్రాలు ఉన్నాయి.










Next Story