రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ను త్వరగా విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 17కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయి, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం సమయాభావం కారణంగా ఈ వ్యాజ్యాన్ని విచారణ చేపట్టలేకపోయింది. రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయిలైన నళిని, రవిచంద్రన్ ల విడుదల విషయంపై సుప్రీంకోర్టే అంతిమ నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు అపెక్స్ కోర్టులో ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది అరిస్టాటిల్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. నళిని, రవిచంద్రన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పెరోల్ మంజూరు చేస్తుంది. అయినప్పటికీ ఈ హత్య కేసులోని ఏడుగురు ముద్దాయిల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులను గవర్నర్‌కు పంపిస్తే రెండేళ్ళపాటు పెండింగ్‌లో ఉంచి జనవరిలో రాష్ట్రపతికి పంపించారని అన్నారు. తొమ్మిది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ నళిని, రవిచంద్రన్‌లను విడుదల చేసే అంశంపై సుప్రీంకోర్టే అంతిమ నిర్ణయం తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.