గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి..!
Strong proof Covid-19 mainly spreads through air. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుపుతూ ఉన్నారు.
By Medi Samrat
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. కరోనా మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాము. ప్రతిసారీ ఏదో ఒక షాకింగ్ విషయం బయటకు వస్తూ ఉంది. ఇక కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించడం మొదలైందని తెలుస్తోంది. కరోనా గాలి ద్వారా వ్యాపించడం ప్రారంభమైందనే శాస్త్రీయ వివరాలను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. యూకేలోని ఆక్స్‌ఫర్డ్ నిపుణులు, అమెరికా, కెనడా నిపుణులతో కూడిన 6 మంది సభ్యుల బృందం దీనిపై పరిశోధనలు చేశారు.
దాదాపు 10 మార్గాల ద్వారా గాలిని వాహకంగా వాడుకొని కరోనా వ్యాపిస్తోందని.. తుంపరల కంటే సూక్ష్మ స్థాయిలో, గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందని ఈ బృందం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు ఇతర దేశాల ఆరోగ్య సంస్థలు కూడా ఈ పరిశోధనలోని విషయాలను పరిశీలించి, వైరస్‌ను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బృందం సభ్యులు కోరారు. ఒకే హోటల్లో వేర్వేరు గదుల్లో ఉంటూ, ఏ మాత్రం భౌతికంగా దగ్గరకు చేరకపోయినా కరోనా వచ్చిందని.. మూసి ఉన్న చోట్ల కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉందని తేల్చేశారు. కరోనా సోకిన వ్యక్తి గాలి వదిలినా, మాట్లాడినా, పాటలు పాడినా, తుమ్మినా వెంటనే కరోనా గాలిలో చేరుతోందని.. తుంపరలు నేల మీద పడినా, గాలిలో మాత్రం కరోనా నిలిచే ఉంటోందని తమ అధ్యయనంలో తెలుసుకున్నారు. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు.