ప్రముఖ నటుడు, కరోనా వేళ తన ఔదార్యం చాటుకున్న మంచిమనిషి సోనూసూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సోనూసూద్‌ను పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిన ప్రతిపాదనను ఆమోదించింది.
ఇదిలావుంటే.. భారతీయ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న సోనుసూద్‌ది పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లా. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు సోనుసూద్ బస్సులను ఏర్పాటు చేశారు. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు రప్పించేందుకు సైతం సొంత ఖర్చులతో విమానాలను సైతం ఏర్పాటు చేయించాడు.
అంతేకాదు.. సోషల్‌మీడియా వేదికగా ఎవరు సాయం కోరినా.. ఎక్కడ కష్టం అనే మాట వినపడ్డా అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్. పేద పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్‌లు.. వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు. దీంతో ఇప్పుడు సోనూసూద్ సోషల్ మీడియా సెన్సేషన్. సోనుసూద్ సేవలకు గుర్తింపుగా ఇటీవల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డీపీ) ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది.